‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:12 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 12,516 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,618 మంది బాలురు, 5,898 మంది బాలికలు ఉండగా, 23 మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాస్తున్నారు.
కరీంనగర్ టౌన్, మార్చి 18: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 12,516 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,618 మంది బాలురు, 5,898 మంది బాలికలు ఉండగా, 23 మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాస్తున్నారు.
ఫ 73 పరీక్షా కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 73 మంది డిపార్టుమెంట్ అధికారులు, 73 మంది అదనపు డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. వారి పర్యవేక్షణలో జరిగే పరీక్షలకు 694 మందిని ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి అరగంట ముందే చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలులో ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. డ్యుయల్ డెస్క్‌లు, తాగునీరు, గాలి వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్యసిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, అదనపు డిపార్టుమెంట్ అధికారుల పర్యవేక్షణతోపాటు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఫ హాల్ టికెట్‌ను విద్యార్థి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
కలెక్టర్ అధ్యక్షతన పదో తరగతి పరీక్షల నిర్వహణపై మూడుసార్లు సమావేశాన్ని నిర్వహించి విద్యా, రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులకు మార్గదర్శనం చేయడంతో ఆయాశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశాయి. జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి విద్యార్థి స్వయంగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థి పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు నంబర్ నమోదు చేసి హాల్ టికెట్ వస్తుంది. ఇందుకు సంబంధించి డీఈవో కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే డెస్క్‌ను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్‌విఎస్ జనార్ధన్‌రావు తెలిపారు. ఈ యేడు వంద శాతం ఫలితాలను సాధించే విధంగా పక్కా ముందస్తు ప్రణాళికతో విద్యాబోధన చేయడంతోపాటు నిపుణులతో సబ్జెక్టులవారిగా విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు, వస్తువులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబోమన్నారు. హాల్ టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్ షార్ప్‌నర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలను మాత్రమే తీసుకు వెళ్లవచ్చని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో తెలిపారు.
Updated Date - Mar 19 , 2025 | 01:12 AM