కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ అభినందనీయం
ABN, Publish Date - May 21 , 2025 | 12:08 AM
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం సప్తగిరికాలనీలో కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 14 కేజీబీవీల నుంచి వంద మంది విద్యార్థినులకు ఈ నెల 6వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చామని అన్నారు. సంగీతం, నృత్య ప్రదర్శన, పెయింటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, ఆర్ట్ క్రాఫ్ట్స్ వంటి వాటిల్లో కేజీబీవీ విద్యార్థినులు శిక్షణ పొందారని తెలిపారు. భవిష్యత్తులో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్‌లో టాపర్లుగా నిలిచిన కేజీబీవీ విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. కేజీబీవీ విద్యార్థుల యోగా, నృత్యం, ఆర్ట్ క్రాఫ్ట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, నెహ్రూ యువకేంద్ర కో-ఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:08 AM