కేంద్ర కులగణన సర్వే చరిత్రాత్మకం
ABN, Publish Date - May 04 , 2025 | 11:39 PM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న కులగణన సర్వే చరిత్రాత్మకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
- కాంగ్రెస్ సర్వేకు, మోదీ సర్వేకు పొంతన లేదు
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్, మే 4 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న కులగణన సర్వే చరిత్రాత్మకమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోదీ కులగణనకు పొంతనే లేదన్నారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీల జనాభాను తగ్గించి చూపారాన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను జనం నమ్మడం లేదన్నారు. 52 వాతం జనాభా ఉన్న బీసీలను 46 శాతంగా చూపారన్నారు. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తున్నామని చెప్పి అందులో పది శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించారన్నారు. నిజానికి కాంగ్రెస్ బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటుందన్నారు. ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. ఆరు గ్యారేంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు. నిషేధిత మావోయిస్టు సంస్థతో చర్చల ప్రసక్తే లేదని, వాళ్లు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంతో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కగార్ ఆపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మందుపాతరలు పెట్టి పోలీసులు, రాజకీయ నాయకులను చంపుతుంటే సామాజిక కోణంలో చూడాలా అని ప్రశ్నించారు. మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్ పాలకులు అన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. మావోయిస్టులు తుపాకులు చేతిలో పట్టుకుని అమాయకులైన గిరిజనులు, పోలీసులను కాల్చి చంపుతున్నారన్నారు. మహాముత్తారంలో ఎస్‌ఐ భార్య సీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్‌ఐని, కానిస్టేబుల్‌ను చంపేశారన్నారు. దూరదర్శన్ జర్నలిస్టును చంపేశారు. బీజేపీ నాయకులు సామ జగన్మోహన్‌రెడ్డి, మధుసూదన్‌గౌడ్, రామన్న, గోపన్నలను చంపేశారన్నారు. కాంగ్రెస్ నాయకుడు అజాత శత్రువు శ్రీపాదరావును చంపేశారన్నారు. కేసీఆర్ టీడీపీలో ఉండగా ఎంతో మంది నాయకులను చంపేశారన్నారు. పాకిస్తాన్ పౌరులను తిరిగే పంపే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చిందని, దేశమంతా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నాన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఇప్పటికీ చాలా మంది పాస్‌పోర్టు వీసాల్లేకుండా ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారముందన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ నివేదిక వచ్చి వారం రోజులైందని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్‌రావు, కొత్తపల్లి మాజీ ఛైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, స్వర్గం నర్సయ్య, చంద్రశేఖర్, కెంచ శేఖర్ పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:39 PM