ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు భారం..

ABN, Publish Date - Jun 01 , 2025 | 01:05 AM

అన్నదాతలకు ప్రతి యేటా పెట్టుబడి భారంగా మారుతోంది. ప్రస్తుత సీజన్‌లో ఎరువుల ధరలు అమాంతం పెరిగి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. డీఏపీ, పొటాష్‌ తదితర ఎరువుల ధరలు పెరిగాయి. దీనికి తోడు ట్రాక్టర్లు, యంత్రాల అద్దెలు, వ్యవసాయ కూలీల కూలి అదనపు భారంగా తయారైంది.

-యేటా పెరుగుతున్న ఖర్చులు

-ప్రస్తుత సీజన్‌లో పెరిగిన ఎరువుల ధరలు

-ట్రాక్టర్‌, నాగళ్ల అద్దె పెంపు

-ఆందోళనలో అన్నదాతలు

జగిత్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు ప్రతి యేటా పెట్టుబడి భారంగా మారుతోంది. ప్రస్తుత సీజన్‌లో ఎరువుల ధరలు అమాంతం పెరిగి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. డీఏపీ, పొటాష్‌ తదితర ఎరువుల ధరలు పెరిగాయి. దీనికి తోడు ట్రాక్టర్లు, యంత్రాల అద్దెలు, వ్యవసాయ కూలీల కూలి అదనపు భారంగా తయారైంది. గత యేడాది కంటే ఈసారి ఎకరాకు రూ.5 వేల వరకు అదనపు భారం పడనుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా రైతులు కాలువలు, చెరువులు, కుంటలు, బోరు బావులు, వర్షాలపై ఆధారపడి వరి సాగు చేస్తుంటారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల్లో అత్యధికంగా వరి సాగు చేస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి, చెరుకు, పసుపు, కంది, పెసర తదితర పంటలపై రైతులు దృష్టి సారించారు.

ఫజిల్లాలో వానాకాలం సాగు అంచనా..

జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా వానాకాలంలో పంటల సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,35,978 ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 4,14,419 ఎకరాలు సాగు చేస్తారని అంచనా. ఇది సాధారణం కన్నా 78,441 ఎకరాలు అధికంగా ఉంది. ఇందులో ప్రధానంగా వరి 3,10,642 ఎకరాలు, మొక్కజొన్న 32,000 ఎకరాలు, కందులు 1,500, పెసర్లు 100, సోయా చిక్కుడు 500, పత్తి 18,000, చెరుకు 500 ఎకరాలు, పసుపు 8,500, మిరప 500 ఎకరాలు, పలు కూరగాయల పంటలు 400 ఎకరాలు, ఆయిల్‌ ఫాం 3,000 ఎకరాలు, మామిడి 38,277 ఎకరాలు, ఇతర పంటలు 500 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. 2023 వానాకాలం సీజన్‌లో జిల్లాలో 4,17,378 ఎకరాల్లో, 2024 వానాకాలం సీజన్‌లో 4,13,974 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు.

ఫకూలీల కొరత..

పసుపు, పత్తి సాగుకు గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. దీంతో అధిక కూలితో పాటు రవాణా ఖర్చులు సైతం భరించాల్సి వస్తోంది. దీనికి తోడు ఇందనం ధరలు పెరుగుతుండడంతో యత్రాల అద్దెలు పెంచడం వల్ల రైతులపై భారం పడుతోంది. గత యేడాది వానాకాలంలో పొలం దున్నేందుకు ట్రాక్టర్‌ అద్దె గంటకు రూ.1,200 ఉండగా ఈసారి రూ.1,500కు పెంచారు. గత యేడాది మగ కూలీలకు రూ.800 వరకు ఉండగా ప్రస్తుతం రూ.900, ఆడ కూలీకు రూ.400 వరకు ఉంటుంది. గత యేడాది పత్తి సాగుకు ఎకరాకు సుమారు రూ.30 వరకు పెట్టుబడి కాగా, ఈ యేడాది రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకు పెరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫడీఏపీ రూ.1,450కి పెంపు

గత యేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎరువుల ధరలు పెరిగాయి. డీఏపీ రూ.1,300 నుంచి 1,450 వరకు పెరిగింది. అదేవిదంగా 20-20-0-15 ఎరువు రూ.1,150 నుంచి రూ. 1,250కు, 28-28-0 ఎరువు రూ.1,275 నుంచి రూ.1,400కు, పొటాష్‌ రూ.850 నుంచి రూ.1,200కు పెరిగాయి. జనుము రూ.1,148 నుంచి రూ.2,500, జీలుగ రూ.1,116 నుంచి రూ.2,138 వరకు ధరలు పెరిగాయి.

గిట్టుబాటు కావడం లేదు

-నోముల రాజేశ్వర్‌రెడ్డి, రైతు, లక్ష్మీదేవిపల్లి

రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో సాగు భారంగా మారుతోంది. కనీసం పెట్టుబడి అయినా చేతికందితే చాలన్న పరిస్థితిలో పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి అనుకూలిస్తేనే పంట చేతికొచ్చే అవకాశం ఉంది. లేదంటే అప్పులే మిగులుతాయి.

ఖర్చులు పెరుగుతున్నాయి

-ఈర్ల శంకరయ్య, రైతు, బుగ్గారం

ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఖర్చులతో పెట్టుబడి భారంగా మారుతోంది. ప్రభుత్వమే ప్రోత్సాహం అందించాలి. రైతులకు సాగు భారం కాకుండా సర్కారు చర్యలు తీసుకోవాలి. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ కూలీల ఖర్చు, ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పెట్టుబడులు సైతం పెరుగుతున్నాయి.

Updated Date - Jun 01 , 2025 | 01:05 AM