సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:18 AM
రైతులకు భూ సమస్యలు లేకుండా చేసేందుకే ధరణి స్థానంలో భూ భారతీ చట్టం తీసుకవచ్చామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
- పకడ్బందీగా, పారదర్శకంగా అమలు
- మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు భూ సమస్యలు లేకుండా చేసేందుకే ధరణి స్థానంలో భూ భారతీ చట్టం తీసుకవచ్చామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని పెర్కపల్లి నుంచి వెన్కేపల్లి మధ్య 3.37కోట్లతో నిర్మించే హై లెవల్ బ్రిడ్జి, పెర్కపల్లి నుంచి దుద్దెనపల్లి మధ్య చిలుకల వాగుపై 3.47 కోట్లతో నిర్మించే హై లెవల్ బ్రిడిలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వెన్కేపల్లి విశాల సహకార పరపతి సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సొసైటీ పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంవగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తాన్నారు. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. 30 సంవత్సరాల క్రితం భూములు విక్రయించి వెళ్లి పోయిన వారి పేర్లు ధరణిలో వచ్చాయని, దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం భూ భారతి చట్టం అమల్లోకి తెచ్చిందని తెలిపారు. ప్రతీ ఒక్కరి భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాదన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో తాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూ భారతి చట్టం రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
ఫ ధరణిపై రైతులు తమ అభిప్రాయాలు తెలుపాలని మంత్రి కోరగా రైతులు లేచి తహసీల్దార్ మంజులపై మంత్రికి ఫిర్యాదు చేశారు. గర్రెపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తాను మోకా మీద ఉండగా తన భూమి తహసీల్దార్ వేరే వారికి రిజిస్టేషన్ చేశారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. పలు గ్రామాలకు చెందిన రైతులు మంత్రికి తహసీల్దార్‌పై ఫిర్యాదులు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ఆర్డీవో రమేష్ బాబు, విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, డీసీవో రామానుజచార్యులు, డీఏవో భాగ్యలక్ష్మి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో యాదగిరి, మాజీ ఎంపీపీలు ప్రభాకర్‌రెడ్డి, వీరేశం సొసైటీ సీఈవో శ్రీధర్ పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:18 AM