ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘పురుమల్ల’పై సస్పెన్షన్‌ వేటు

ABN, Publish Date - May 07 , 2025 | 01:31 AM

కాంగ్రెస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌పై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్‌ వేటు వేసింది. వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కమిటీ పేర్కొంది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌పై ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్‌ వేటు వేసింది. వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కమిటీ పేర్కొంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పురుమల్ల శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన సస్పెన్షన్‌కు దారితీశాయి. జనవరి మొదటి వారంలో పురుమల్ల డీసీసీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి తాను నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా తనకు తెలియకుండానే పదవుల నియామకాలు జరుగుతున్నాయని అన్నారు. తాను నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం సూచించిన పేర్లను పక్కన పెడుతున్నారని అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కారణమని పరోక్షంగా పేర్కొంటూ మాట్లాడి పార్టీలో కలకలం సృష్టించారు. ఈ ఎపిసోడ్‌ ఇప్పటికే ఆగిపోలేదు.. మరికొన్ని ఎపిసోడ్‌లు ఉంటాయంటూ సవాల్‌ విసిరారు. ఆ సందర్భంగా పురుమల్లకు వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్‌ నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీకి, టీపీసీసీకి ఫిర్యాదు చేసి ఆయనపై చర్యకు డిమాండ్‌ చేశారు.

ఫ జనవరి 6న షోకాజ్‌ నోటీస్‌

జనవరి 6న క్రమశిక్షణ కమిటీ పురుమల్లకు షోకాజ్‌ నోటీస్‌ పంపించింది. దానికి శ్రీనివాస్‌ జనవరి 11న వివరణ పంపించారు. క్రమశిక్షణ కమిటీ నుంచి వివరణకు సంబంధించి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని భావించారు. ఉన్నట్టుండి మంగళవారం జనవరి 6న ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌కు 11న మీరు పంపించిన వివరణతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించామని పేర్కొంటూ పురుమల్ల శ్రీనివాస్‌కు సస్పెన్షన్‌ ఆదేశాలు పంపించింది. పార్టీ సహచరులతో మీ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి తగినంత సమయం ఇచ్చినా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపింది. కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జి చిన్నారెడ్డి ఈ ఆదేశాలను పురుమల్లకు పంపించారు.

ఫ పార్టీ పెద్దల సమక్షంలోనే..

డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత పురుమల్ల శ్రీనివాస్‌ మంత్రి ప్రభాకర్‌కు దూరంగా ఉంటూ వస్తూ వ్యతిరేక శిబిరంగా కొనసాగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించగా ఆ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాట్లాడిన శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథన్‌ పెరుమాళ్‌, జిల్లా పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్‌, పి రఘునాథ్‌ రెడ్డి సమక్షంలోనే పురుమల్ల శ్రీనివాస్‌ తాము నామినేటెడ్‌ పదవుల విషయంలో ఏ ప్రతిపాదనలు టీపీసీసీకి పంపించినా ఒక దుర్మార్గుడు అడ్డుకుంటున్నాడని అన్నారు. ఇప్పటికి నాలుగైదు ప్రతిపాదనలకు అదేగతి పట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఒకరినొకరు తోసేసుకునే పరిస్థితి ఉత్పన్నమయింది. శ్రీనివాస్‌ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగిపోతున్నదని తెలిపారు. మంత్రిని టార్గెట్‌ చేస్తూ శ్రీనివాస్‌ మాట్లాడారని భావించిన ఆర్డీఏ సభ్యుడు పడాల రాహుల్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు బోనాల శ్రీనివాస్‌ తదితరులు పురుమల్లను అడ్డుకుంటూ ఆ దుర్మార్గుడెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక దశలో వేదికపైనే ఒకరినొకరు తోసుకుంటూ తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించడంతో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి వారందరిని స్టేజీ కిందకు నెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ పెరుమాళ్‌ తన సమక్షంలో జరిగిన ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలుంటాయని, క్రమశిక్షణ తప్పేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అదే వేదికపై హెచ్చరించారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ పరిశీలకులు హాజరైన సమావేశంలో ఈ గొడవకు కారణమైన పురుమల్ల శ్రీనివాస్‌పై వేటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమయింది. ఈ సంఘటన తర్వాత కూడా పలువురు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ పురుమల్ల శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - May 07 , 2025 | 01:31 AM