శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:28 AM
జిల్లాలో వివాహాల కోలాహలం ప్రారంభం కానుంది.
జగిత్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివాహాల కోలాహలం ప్రారంభం కానుంది. శ్రావణ మాసం ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. శుభకార్యాలు శుక్రవారం నుంచి మొదలు కానున్నాయని జగిత్యాలకు చెందిన వేద పండితులు అంటున్నారు. నెలన్నర రోజులుగా వేడుకలు పెద్దగా లేకపోవడంతో వివిధ వృత్తుల వారు, వ్యాపారులు ఉపాధికి దూరమయ్యారు. మళ్లీ ముహూర్తాలు మొదలు కానుండడంతో డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఈవెంట్లు, కేటరింగ్‌తో పాటు జ్యూవెలరీ, వస్త్ర, కిరాణ తదితర వ్యాపారాలకు గిరాకీ పెరగనుంది. శ్రావణ మాసం ప్రారంభం అవుతుండడంతో మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలుకానుంది. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడుముళ్లతో అధిక సంఖ్యలో నవ జంటలు ఒక్కటి కానున్నాయి. ఇందుకు అనుగుణంగా యువతీ యువకుల తల్లిదండ్రులు ముందస్తు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో అధికసంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి.
ఇవీ వివాహ ముహూర్తాలు..
వివాహానికి యోగ్యమైన ముహూర్తాలను పండితులు సూచిస్తున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఈనెల 26వ తేదీ, 27, 30, 31 తేదీల్లో పలు ముహూర్తాలు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. ఆగస్టు 3, 5, 7, 8, 10, 11, 14, 15, 17, 18వ తేదీల్లో సైతం మంచి ముహూర్తాలున్నాయి. భూమిపూజలు, శంకు స్థాపనలు, గృహ ప్రవేశాల, కేశఖండనాలు, ప్రతిష్ఠాపనల నిర్వాహకులు పురోహితులను సంప్రదించి ముహూర్తాలను నిర్ణయించుకుంటున్నారు. మళ్లీ ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో అంటే...అక్టోబరు 4వ తేదీ, 8, 16, 24, 31, నవంబరు 1వ తేదీ, 7, 22, 23, 25, 26, 29 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి వీలుగా ముహూర్తాలున్నాయని వేదపండితులు అంటున్నారు. దీనికి తోడు జిల్లాలో ప్రత్యేక పూజలు, పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయక చవితి పండగలతో ఆలయాల్లో పాటు ప్రధాన వీదులు, గృహాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.
ఫంక్షన్ హాళ్లు.. క్యాటరింగ్ ముందస్తు బుకింగ్‌లు..
జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో వివాహ నిర్వాహకులు ముందస్తు పనులపై దృష్టిసారించారు. మూడు నెలల ముహూర్తాల్లో సుమారు వెయ్యికిపైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, పురోహితులు, భాజా భజంత్రీలు, ఆర్కేస్ట్రా, డెకరేషన్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్ స్టుడియోలు ఇలా పెళ్లికి అవసరమైన వాటిని ముందస్తుగా బుక్ చేసుకోవడంపై దృష్టి సారించారు. వివాహాలకు అవసరమైన పట్టు వస్త్రాలు, దుస్తులు, బంగారు ఆభరణాలు ముందస్తు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సుమారు 150 వరకు ఫంక్షన్ హాళ్లు, సుమారు 300 వరకు కమ్యూనిటీ హాళ్లు, పదుల సంఖ్యల్లో దేవాలయాల్లో పెళ్లి మండపాలు ఉన్నట్లు అంచనా ఉంది. వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవడంపై వివాహాల నిర్వాహకులు దృష్టి సారించారు.
ఊపందుకోనున్న వ్యాపారాలు..
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పలు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. షాపింగ్ మాల్స్, బట్టల దుకాణాలు, జ్యూవెల్లరీ దుకాణాలు, లేడిస్ ఎంపోరియంలు, ఫొటో స్టుడియోలు, వీడియోగ్రఫీ సెంటర్లు, ప్రీ వెడ్డింగ్ షూట్ స్టూడియోలు, పంక్షన్ హాల్స్, క్యాటరింగ్ కేంద్రాలు, ఫ్లవర్ డెకరేటర్స్, వంట మాస్టర్స్ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వ్యాపారాల నిర్వాహకులు చేసుకున్నారు. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో బంగారం, వస్త్రవ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యాపారులు తీసుకువచ్చి దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వినియోగదారులను ఆకర్శించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహుమతులను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహాల సీజన్‌లో జిల్లా మొత్తంగా రోజుకు కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Updated Date - Jul 24 , 2025 | 02:28 AM