స్పోర్ట్స్ అంటేనే తెలంగాణ వైపు దేశం చూడాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:44 AM
స్పోర్ట్స్ అంటేనే తెలంగాణ వైపు దేశం చూడాలని, రాష్ట్రానికి, దేశానికి పేరును తీసుకొచ్చే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : స్పోర్ట్స్ అంటేనే తెలంగాణ వైపు దేశం చూడాలని, రాష్ట్రానికి, దేశానికి పేరును తీసుకొచ్చే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో ఆర్చరీ అకాడమీని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం స్టేడియంలోని వాలీబాల్ అకాడమీని పరిశీలించి వాలీబాల్ క్రీడాకారులతో పాటు ఖేల్ ఇండియా కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శివసేనరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం హయామంలో తెలంగాణలో 2014 నుంచి 2024 వరకు పది సంవత్సరాల్లో క్రీడలకు కేటాయించింది కేవలం రూ.360కోట్లు మాత్రమేనని, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2024 నుంచి కేవలం రెండు సంవత్సరాల కాలంలో క్రీడలకు కేటాయించిన బడ్జెట్ రూ.850కోట్లు అని అన్నారు. తెలంగాణ జిల్లాలో ఎక్కడికి వెళ్లినా క్రీడా సమస్యలే ఎదురవుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకమైన నాయకుడు, ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి నియోజకవర్గంలోని మినీస్టేడియంలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్ చూస్తే వారి వ్యవస్థ ఎలాగా ఉందో అర్థం అవుతుందన్నారు. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా సిరిసిల్లలో పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. మినీ స్టేడియం ట్రాక్ నిర్మాణంకు రూ.5 కోట్ల నుంచి రూ. 6 కోట్లు ఖర్చు అయి ఉంటుందని, 20 సంవత్సరాల వరకు ఉండాల్సిన సింథటిక్ ట్రాక్ రెండు సంవత్సరాలకే గుంతలు పడిందన్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేశారని, బాధ్యుడైన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. జిమ్, వాలీబాల్ బాలికల అకాడమీ ఏర్పాటు కృషి చేస్తామన్నారు.
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి..
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అహర్నిషలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్కిల్ యూనివర్సిటీని రాష్ట్రానికి తీసుకవచ్చారన్నారు. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్లలో క్రికెట్ స్టేడియాల నిర్మాణంకు ఐదు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని స్టేడియం నిర్మాణకు యుద్ధ ప్రాతిపధికన నిధులు మంజూరు చేయాలని, వేములవాడకు కబడ్డీ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్స్‌ని మంజూరుచేయాలని శాప్ చైర్మన్‌ను కోరారు. కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లలో మొట్టమొదటి స్పోర్స్ స్కూల్ కమ్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, టీపీసీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా మహిళ అధ్యక్షురాలు కాముని వనిత, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీకుమార్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ఆర్చరీ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:44 AM