మురిపించి.. ముఖం చాటేసి..
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:31 AM
నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ర్టాన్ని తాకాయి.
- పత్తాలేని వానలు.. ఎండుతున్న నారుమడులు
- వరి సాగు అంచనా 2,76,500 ఎకరాలు
- నాటేసింది 38,459 ఎకరాలు
- సాగు చేసిన పత్తి 35,361 ఎకరాలు
- నాట్లు ఆలస్యమైతే దిగుబడి తగ్గే ప్రమాదం
- సాగుపై సన్నగిల్లుతున్న ఆశలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ర్టాన్ని తాకాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వర్షాలు కురిశాయి. ఈసారి సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అన్నదాతలు సాగుపై ఆశలు పెంచుకున్నారు. రోహిణికార్తె చివరలో, మృగశిరలో రైతులు వరినార్లు పోసుకున్నారు. ఆ నారు ఎదిగి నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నది. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. వాతావరణం ఎండాకాలాన్ని తలపించే విధంగా మారింది. ఎదిగిన నారు ఎండిపోయే పరిస్థితి రావడంతో నారుమడుల్లో నీళ్లు చల్లుకుంటూ బతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ దయనీయంగా పత్తి, మొక్కజొన్న
తొలకరి వర్షాలతో మొక్కజొన్న, పత్తి విత్తుకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. విత్తిన తర్వాత వర్షాలు పడకపోవడంతో విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. మొలకెత్తిన పత్తి, మొక్కజొన్న కూడా ప్రస్తుత ఎండలకు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వర్షాభావ పరిస్థితులు జిల్లాలో సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఫ 10 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
జూన్ ప్రారంభం నుంచి జూలై 14వ తేదీ వరకు జిల్లాలో సాధారణంగా 220.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈసారి 152.6 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. జిల్లాలోని 16 మండలాల్లో 10 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుండగా ఆరు మండలాల్లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. జూన్‌లో ఏడు రోజులు అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు కురిసి 99.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 124.5 మిల్లీ మీటర్లు. జూలైలో 14 రోజుల్లో సాధారణంగా 95.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 53.1 మిల్లీ మీటర్ష వర్షం మాత్రమే కురిసింది. ఐదు రోజులు మాత్రమే ఓ మోస్తరు వర్షపాతం నమోదయింది. దీంతో జిల్లాలో పూర్తిగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ 22 శాతమే సాగు
ఈ సీజన్‌లో జిల్లాలో 2,76,500 ఎకరాలల్లో వరి, 48 వేల ఎకరాల్లో పత్తి, నాలుగు వేల ఎకరాల్లో మొక్కజొన్న, 13,045 ఎకరాల్లో కూరగాయలు, హార్టికల్చర్ సాగు, వెయ్యి ఎకరాల్లో కందులు, 150 ఎకరాల్లో వేరుశెనగ, 200 ఎకరాల్ల పెసర, 300 ఎకరాల్లో పొగాకు పంటలు సాగు కావాల్సి ఉన్నది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు 38,459 ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యింది. 35,361 ఎకరాల్లో పత్తి, 1,682 ఎకరాల్లో మొక్కజొన్న, 126 ఎకరాల్లో కంది, 87 ఎకరాల్లో పెసర పంటలు వేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగు అంచనాలో ఇది 22 శాతమే.. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగితే 75,715 ఎకరాల్లో సాగు చేసిన అన్ని పంటలతోపాటు మడుల్లో నాటు వేయకుండా ఉన్న నారు కూడా ఎండిపోయే ప్రమాదం ఉన్నది.
ఫ అడుగంటుతున్న బావులు, బోర్లు
బావుల కింద, బోరు బావుల వద్ద సాగు చేసిన పంటలను రైతులు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో నీరు చేరే విధంగా వర్షాలు కురవకపోవడంతో వాటికింద నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. వర్షాభావ పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోరు బావుల కింద సాగు చేసిన పొలాలు కూడా ఎండిపోయే అవకాశం ఉన్నది. ఎదిగిన నారు ఎండ తీవ్రతకు మడుల్లో ఉన్న నీరు వేడెక్కి ఎర్రబడిపోతున్నది. నాటేసిన పొలాల్లో నీరు వేడెక్కుతున్న కారణంగా మొక్కలు గొట్టంగా మారుతున్నాయి. దీంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. మరో నాలుగైదు రోజులపాటు వర్షాలు కురవకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది.
ఫ ముదురుతున్న పచ్చిరొట్ట
పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుందని పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలను రైతులు వేసుకున్నారు. ఈ విత్తనాలు మొలకెత్తి ఉన్నాయి. వీటి నుంచి 45 రోజుల్లోగానే పొలాల్లో నీటితో కలిపి దున్నాల్సి ఉంటుంది. నీరు లేని కారణంగా జీలుగ పెరిగిపోతున్నది. ఆ తర్వాత నీరు వచ్చినా ఈ మొక్కలను పొలంలో దున్నే అవకాశం లేకుండా పోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ ప్రాజెక్టుల్లోకి చేరని నీరు
జిల్లాలోని సాగు భూమిలో 90 శాతం భూమి ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోనే ఉంటుంది. ఎస్సారెస్పీ ద్వారా నీటి విడుదల జరిగితేనే ఇక్కడ నాట్లు పడే పరిస్థితి ఉంటుంది. ఎస్సారెస్పీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ఇప్పుడు కేవలం 20.9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కూడా పెద్దగా లేదు. 2,172 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతున్నది. ఈ ప్రవాహంతో ఐదు రోజులకు ఒక టీఎంసీ నీరు ప్రాజెక్టులో చేరుతుంది. ప్రాజెక్టులో కనీసం 40 నుంచి 50 టీఎంసీల నీరు వచ్చి చేరితేనే ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. మిడ్ మానేరులో కూడా 27.55 టీఎంసీలకుగాను కేవలం 6.85 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండడంతో దీని నుంచి ఎల్‌ఎండీకి నీరు వదిలే అవకాశం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.17 టీఎంసీలకు 8.96 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఈ ప్రాజెక్టు నిండితే వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు, ఎల్‌ఎండీకి నీరు విడిచే అవకాశం ఉంటుంది. జూలై చివరి వరకు అయినా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి నీరు వస్తే ఆలస్యంగానైనా నాట్లు వేసే పరిస్థితి ఉంటుంది. నెలరోజులు దాటితే జిల్లాలో కరువు పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి...
- తిరుపతి, రైతు, పెద్దకుర్మపల్లి
వానలు కురవడం లేదు. వాతావరణ అధికారులు చెప్పిన మాటలు తప్పయ్యాయి. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని చెప్పడంతో ముందస్తుగా నార్లు పోసుకున్నాం. నార్లు ముదిరిపోతున్నాయి. కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి పొలాలకు నీరందించాలి. ఆ నీటితో సాగు చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఫ పంటల బీమా చేయాలి...
- రావుల రాంరెడ్డి, రైతు, లింగాపూర్
ముందుగా కురిసిన వర్షాలను నమ్ముకుని నార్లు పోశాం. 45 రోజులు గడిచినా ఇప్పటి వరకు అనుకున్నంత వానలు పడలేదు. ఇప్పుడు వర్షం పడినా ముదిరిన నారు నాటు వేస్తే దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఆలస్యంగా నాట్లు వేస్తే చలి తీవ్రతతో పొట్ట దశలో పొట్ట త్వరగా బయటకు రాదు. దిగుబడి తగ్గుతుంది. ఈ వానాకాలం సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలి.
Updated Date - Jul 15 , 2025 | 01:31 AM