siricilla : మరపురాని స్మృతులెన్నో..
ABN, Publish Date - Jun 02 , 2025 | 01:02 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) రగిలిన గుండెల్లో రక్తం ఎగజిమ్మిన వెచ్చటి సూర్యోదయం. దొరల గడీల మధ్య అణచబడ్డ మట్టి ఆత్మఘోష. తెలంగాణ రైతాంగ పోరాటాల మధ్య చైతనవ్యవంతమైన సిరిసిల్ల పల్లెలు తెలంగాణ సాధన కోసం గొంతెత్తి పిడికిలి బిగించాయి.
- ఉద్యమ జ్ఞాపకాల్లో పోరుగడ్డ సిరిసిల్ల
- జిల్లాలో 22 మంది బలిదానాలు
- సిరిసిల్ల నుంచి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్
- నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రగిలిన గుండెల్లో రక్తం ఎగజిమ్మిన వెచ్చటి సూర్యోదయం. దొరల గడీల మధ్య అణచబడ్డ మట్టి ఆత్మఘోష. తెలంగాణ రైతాంగ పోరాటాల మధ్య చైతనవ్యవంతమైన సిరిసిల్ల పల్లెలు తెలంగాణ సాధన కోసం గొంతెత్తి పిడికిలి బిగించాయి. రాజన్న సిరిసిల్ల జనం తెలంగాణ మహోద్యమంలో తనదైన పాత్రను పోషించింది. సకల జనుల సమ్మె, ధూంధాంలతో సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్మృతులతో 11 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాగా పాలన సౌకర్యం చేరువకాగా, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలతో అభివృద్ధి పథంలో ముందడుగు వేసింది. గడిచిన ప్రభుత్వ హయాంలో పదేళ్లు ప్రగతి పథంలోనే సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ప్రత్యేకతను సాధిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆరు గ్యారంటీలతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్లు నింపి రైతులకు అందించే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలో ఉద్యోగులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు సంస్థలు తెలంగాణ ఉద్యమ బాటలో సకల జనుల సమ్మెలో వంద రోజులకు పైగా రిలే దీక్షలను కొనసాగించి. ఉద్యమాన్ని మలుపు తిప్పడంతో ముందు వరుసలో నిలిచారు. జాయింట్ యాక్షన్ కమిటీలు, ఉద్యోగుల సంఘాలు ఉద్యమ జోరును పెంచాయి. తెలంగాణ ఉద్యమం కోసం ఇంటర్మీడీయేట్ విద్యార్థుల నుంచి కుల వత్తులు చేసుకునే రైతుల వరకు ఆత్మబలిదానాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో 162 మంది అమరులు ఉండగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 మంది ఉన్నారు.
ప్రధాన సంఘటనల్లోకి వెళ్తే..
తెలంగాణ ఉద్యమ సారధి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ఊపిరి పోశారు. అదే సంవత్సరం మే 14న ఉమ్మడి జిల్లా కరీంనగర్‌లో సింహగర్జన పేరుతో తొలి బహిరంగ సభను నిర్వహించారు. అందులో సిరిసిల్ల ప్రజలు కేంద్ర బిందువుగా మారారు. కేసీఆర్ 2009 నవంబర్ 8న దీక్షకు ముందు ఢిల్లీలో అన్ని పార్టీల మద్దతును పొందడానికి వెళ్లే సమయంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల మానేరు వాగుపైనే తన పూజ బట్టలను మార్చుకొని నేరుగా ఢిల్లీకి వెళ్లారు. సిరిసిల్ల గడ్డపై సీమాంధ్రుల నేతలను అడుగు పెట్టనివ్వకుండా తరిమికొట్టిన సందర్భం మరిచిపోనిది. 2012లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి సిరిసిల్ల నేత కార్మికులను పరామర్శించే పేరుతో వచ్చిన ఆ క్షణాలు సిరిసిల్ల రణరంగంగా మారింది. తెలంగాణ వాదులు భారీ పోలీసు బందోబస్తును ఛేదించి ఆమెను అడ్డుకోగా, సభను జరిపామనుకుంటూ వెళ్లిపోయారు. సిరిసిల్ల న్యాయవాదులు కోర్టుపైన నల్ల జెండాలు ఎగరవేశారు. ఢిల్లీలో సైతం న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణ ఉద్యమ కారులు ఆర్టీసీ బస్సును సైతం దగ్ధం చేశారు. 2012 సెప్టెంబర్ 13 నుంచి మొదలై అక్టోబర్ 25వరకు జరిగిన సకల జనుల సమ్మెలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, మహిళలు, యువకులు, అన్ని కుల సంఘాలు ర్యాలీలు, ధర్నాలతో ఉద్యమంలో పాల్గొన్నారు. 2011లో జనచైతన్య యాత్రతో సిరిసిల్లకు వచ్చిన బీజీపీ అగ్రనేత అద్వానీ ముందు తెలంగాణ నినాదాల హోరును హోరెత్తించారు. అద్వానీ తెలంగాణ ఆకాంక్షను గుర్తించానని ప్రకటించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 100 రోజుల పాటు సాగిపోయాయి. ప్రతిరోజు వివిధ కుల సంఘాల ర్యాలీలు, బతుకమ్మ ఆటలు, బోనాల పండుగలు, వంటా వార్పులతో తెలంగాణ ఉద్యమ ఉధృతిని చాటారు. తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మలు దహనం.. రాస్తారోకోలు లేని రోజులే లేవు.. విద్యార్థుల భారీ ర్యాలీలు తెలంగాణ ఆకాంక్షకు మరింత బలాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్, విమలక్కతో పాటు ఎంతో మంది గాయకులు సిరిసిల్లలో ధూంధాంలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి వెంకటేశం, గాయకుడు తిరుపతిరెడ్డి, కార్మికుడు శ్రీనివాస్‌తో పాటు పలువురు బలిదానం చేయడంతో ఉద్యమం ఉధృతంగా మారడానికి దోహదపడింది.
తెలంగాణ పోరులో పిడికిలెత్తిన మహిళ..
ఆనాడు స్వాతంత్య్ర పోరు... నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సిరిసిల్ల మహిళలు ధిక్కార స్వరాన్ని వినిపించారు. 1935లో సిరిసిల్లలో ఆంధ్రా మహిళ సభ మాడిపాటి మాణిక్యమ్మ, ఎల్లప్రగడ సీతాదేవి లాంటి వారే నిర్వహించిన సభతో మహిళా ఉద్యమస్ఫూర్తిని ఆనాడు చాటితే... అదే స్ఫూర్తితో తెలంగాణ పోరులో సిరిసిల్ల మహిళలు పిడికిలెత్తారు. తమ ఆందోళన ఫలితం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుతో సాకారం కావడంతో సిరిసిల్ల మహిళ ఆనందంతో ఉప్పొంగిపోతోంది. తెలంగాణ ఉద్యమంలో తాము పోషించిన పాత్రను మరోసారి గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తెలంగాణ సాధన కోసం మేమున్నామంటూ కొంగును నడుముకు చుట్టి బతుకమ్మలు, బోనాలతో ఆందోళన పథంలోకి అడుగులు అడుగులు వేశారు. సిరిసిల్లలో దాదాపు 20వేల మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్రంలోనే సిరిసిల్ల మహిళ శక్తిని చాటారు. రోడ్డుపైనే వంటావార్పులు, రిలే దీక్షలు, రాస్తారోకోలు కేవలం మహిళలు మాత్రమే నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిలయమే కాదు పోరాటాలకు కేంద్రంగా కూడా చాటి చెబుతున్నారు. తెలంగాణ సాయుధ పోరులో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న సిరిసిల్ల మహిళలు తెలంగాణ ఉద్యమంతో సిరిసిల్లను ముఖ్య భూమికగా నిలిపారు. మహిళ ప్రజాప్రతినిధులే కాకుండా బీడీలు చుట్టే అక్కలు, నాట్లు వేసే చెల్లెళ్లు కూడా రోడ్డెక్కి ఉద్యమ పోరులో నిలుస్తున్నారు. సిరిసిల్ల గాంధీచౌక్‌ను కేంద్రంగా మహిళలు నిర్వహించిన పోరాటాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో రూపంలో మహిళలు తమ పోరును కొనసాగించారు.
కలెక్టరేట్‌లో వేడుకలకు ఏర్పాట్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లుచేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు, 9.30 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 9.38 నిముషాలకు ప్రభుత్వ విప్ తన సందేశాన్ని ఇస్తారు.
Updated Date - Jun 02 , 2025 | 01:06 AM