siricilla : నిరంతర నిఘా..
ABN, Publish Date - May 11 , 2025 | 12:24 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) దేశ సరిహద్దుల్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో నిరంతరం నిఘా పెంచి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
- ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా అప్రమత్తం
- జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు
- ఆలయాల్లో పూజలు, హోమాలు..
- సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీలు
- జిల్లాలో హోరెత్తుతున్న జై హింద్ నినాదాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
దేశ సరిహద్దుల్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో నిరంతరం నిఘా పెంచి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ మహేష్ బీ గితే నేతత్వంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో వేములవాడ దేవస్థానంతో పాటు నాంపల్లి గుట్ట, జిల్లాలోని సందర్శన ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేశారు. జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు, అన్నపూర్ణ ప్రాజెక్ట్, ఇతర జనసంచారాలు ఉండే ప్రాంతాలను తనిఖీలు చేశారు. ప్రధానమైన సిరిసిల, వేములవాడ బస్‌స్టేషన్లలో తనిఖీలతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో లాడ్జిలు, హోటళ్లు అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా పోలీస్ బృందాలు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. హోరెత్తుతున్న ‘జై హింద్’ నినాదాలు ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలి.. దేశం సత్తా చాటాలి, సైన్యం సురక్షితంగా ఉండాలని కాంక్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోమాలు పూజలు, సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు దేవాలయాల్లో రాజకీయాలకతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సైన్యానికి అండగా జిల్లా వ్యాప్తంగా జై హింద్, భారత్ మాతాకీ జై.. నినాదాలతో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా జిల్లాలో ఆపరేషన్ సిందూర్ ఎలా సాగుతోందనే చర్చ కొనసాగుతోంది. బార్డర్‌లో మన జవాన్లు.. ఆపరేషన్ సిందూర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా జవాన్లు వివిధ హోదాల్లో ప్రాణాలను ప్రాణంగా పెట్టి యుద్ధభూమిలో ముందుకు సాగుతున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై భారత్ తలపెట్టిన యుద్ధంలో జిల్లాకు చెందిన జవాన్లు భాగస్వాములు అవుతున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో జిల్లా జవాన్లు ఉండడాన్ని తలచుకుంటూ వారి కుటుంబ సభ్యులు, ప్రజలు భావోద్వేగాలకు లోనవుతున్నారు. జిల్లాలో ప్రతి మండలం నుంచి దాదాపు 30 నుంచి 50 మంది వరకు జవాన్లు ఉన్నారు. వీరంతా బార్డర్లలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కాశ్మీర్, లద్దాక్ తదితర ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు.
తనిఖీలు ముమ్మరం చేశాం.. ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దు
- జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే
దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిఘా పెంచామని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని ఎస్పీ మహేష్ బీ గితే కోరారు. శనివారం జిల్లాలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బలగాలతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే పర్యాటక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడిన వెంటనే 100 డయల్ లేదా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని, అనాధారిత సమాచారాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయవద్దని, పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని కోరారు.
Updated Date - May 11 , 2025 | 12:24 AM