ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యాశాఖలో షోకాజ్‌ నోటీసుల కలకలం

ABN, Publish Date - Jun 22 , 2025 | 01:07 AM

జిల్లా విద్యాశాఖలో షోకాజ్‌ నోటీసులు కలకలం రేపుతున్నాయి.

జగిత్యాల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖలో షోకాజ్‌ నోటీసులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో డీఎస్సీ-2024 టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా స్కూల్‌ అసిస్టెంట్‌ (హిందీ), లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీ) పోస్టుల భర్తీ సందర్భంగా అభ్యర్థుల క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్ల పరిశీలన సందర్భంగా నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ కొందరు అభ్యర్థులు న్యాయ పోరాటానికి దిగారు. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి విద్యాశాఖ అధికారులకు, ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు వచ్చినట్లు సమాచారం. ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాము స్పందించి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ విధులు నిర్వహించిన ఆరుగురు ఉద్యోగులకు, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ముగ్గురు ఉపాధ్యాయులకు సైతం షోకాజు నోటీసులు జారీ చేసి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

ఫనియామకం జరిగిందిలా..

ప్రభుత్వ పాఠశాలల్లో టీజీటీ (హిందీ) ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి 2024 ఫిబ్రవరి 29 తేదీన నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 15 హిందీ లాంగ్వేజ్‌ పండిత్‌, 6 స్కూల్‌ అసిస్టెంట్‌ (హిందీ) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో సుమారు 80 మందికి పైగా నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. 2024 ఆగస్టు 5వ తేదీన పరీక్షను నిర్వహించి సెప్టెంబరులో ఫలితాలను ప్రకటించారు. 2024 అక్టోబరు 5వ తేదీన ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున 21 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. అనంతరం 2024 అక్టోబరు 10న ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఆర్డర్లు అందజేశారు.

ఫఆరోపణలు ఇవీ..

లాంగ్వేజ్‌ పండిత్‌ హిందీ ఉపాధ్యాయ పోస్టుకు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి మూడు సంవత్సరాల డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ హిందీ అర్హత ఉండాలన్న నిబంధన ఉంది. యూజీసీ, ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి హిందీ పండిత్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలనే నిబంధన సైతం ఉంది. టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణులు కావాలి. కానీ ఇతర రాష్ట్రాల దూర విద్యా కోర్సులకు, అర్హత లేని హిందీ మాధ్యమ, విశారద కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పోస్టులు కేటాయించారన్న ఆరోపణలున్నాయి. యూజీసీ గుర్తింపు పొందని యూజీ, పీజీ అర్హత గల వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పలువురు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని జిల్లాలోని పెగడపల్లి, కోరుట్ల తదితర ప్రాంతాలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పలు మార్లు కలెక్టర్‌, డీఈవో, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో 2025 మార్చిలో కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు డబ్బులు చేతులు మారినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫరివ్యూ కమిటీ పనితీరుపై అనుమానాలు..

టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా సర్టిఫికెట్ల పరిశీలనలపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2024 నవంబరు మొదటి వారంలో రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పలువురు అధికారులు, ఉద్యోగులను సభ్యులుగా నియమించారు. సంబంధిత కమిటీ ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పునః పరిశీలన చేయాల్సి ఉంటుంది. అయితే పునః పరిశీలనలో సర్టిఫికెట్లపై పలు అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ వ్యవహారాన్ని బయటకు రానివ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

జిల్లాలో డీఎస్సీ-2024 హిందీ పండిత్‌ ఉపాధ్యాయ నియామకాలపై తప్పులు జరిగిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి సంబంధిత ఉద్యోగులు, పలువురు అభ్యర్థులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. నియామకాల సందర్భంగా తప్పులు జరిగాయా లేదా అన్న విషయాలు విద్యాశాఖ విచారణలో తేలాల్సి ఉంది.

Updated Date - Jun 22 , 2025 | 01:07 AM