నెలంతా రేషన్ పంపిణీ
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:09 AM
వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం జూన్‌లోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంపిణీ ప్రారంభమయింది. ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేసే ఆనవాయితీకి భిన్నంగా ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
- మూడు నెలలవి ఒకేసారి ఇస్తుండడంతో ప్రభుత్వ నిర్ణయం
- ఈ నెల 30 వరకు జూన్, జూలై, ఆగస్టు కోటా
- జిల్లాలో 2,90,402 కార్డులు.. నెలకు 16,748 మెట్రిక్ టన్నుల బియ్యం
- 50,245 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకి ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం జూన్‌లోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంపిణీ ప్రారంభమయింది. ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేసే ఆనవాయితీకి భిన్నంగా ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
వేలిముద్రలు తీసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు
ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేసే సమయంలో వేలిముద్రలు తీసుకునే క్రమంలో ఆలస్యమవుతుండడంతో నెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 2,90,402 రేషన్ కార్డులు ఉండగా అందులో 8,79,888 మంది లబ్దిదారులుగా నమోదయ్యారు. వీరందరికి ఒక్కో నెల 16,748 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. జూన్, జూలై, ఆగస్టు కోటా పంపిణీ చేస్తున్నందున జిల్లా యంత్రాంగం 50,245 మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉంచింది. ఆహార భద్రత కార్డులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు కూడా కార్డుకు నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు నెలకు 10 కిలోల చొప్పున మూడు నెలలకు 30 కిలోల బియ్యం పంపిణీ జరుగుతున్నది. అంత్యోదయ కార్డుదారులకు నెలకు కిలో చక్కెర చొప్పున మూడు నెలలకు మూడు కిలోలు కిలోకు 13.5 రూపాయల చొప్పున చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో 2,74,660 ఆహార భద్రత కార్డులు, 15,707 అంత్యోదయ ఆహార భద్రత కార్డులు, 38 అన్నపూర్ణ రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికి బియ్యం సరఫరా జరుగుతున్నది. వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్ కోటాను జూన్ మాసంలోనే ఇస్తున్నామని, ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు.
Updated Date - Jun 10 , 2025 | 01:09 AM