రామగుండం ’రైజింగ్’...
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:05 AM
గోదావరిఖని, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైజింగ్’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిపథాన్ని కొనసాగిస్తోంది. రామగుండంలో అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఏడాదిన్నర కాలంలో రూ.900కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, రామగుండం సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి.
రూ.900కోట్లతో అభివృద్ధి పనులు
రోడ్లు, డ్రైన్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు...
పట్టణ ప్రాంతాల సుందరీకరణ
గోదావరిఖని, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైజింగ్’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిపథాన్ని కొనసాగిస్తోంది. రామగుండంలో అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఏడాదిన్నర కాలంలో రూ.900కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గోదావరిఖని, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, రామగుండం సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలతో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. ఆసుపత్రుల నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, నర్సింగ్ కళాశాల, కొత్త షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇలా రకరకాలుగా ఏక కాలంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గోదావరిఖని జీఎం ఆఫీస్ చౌరస్తా నుంచి రామగుండం బీ పవర్‌హౌస్ వరకు ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ టర్నింగ్, మున్సిపల్ జంక్షన్ ఐదు చోట్ల సెంటర్ల వెడల్పుతో పాటు అభివృద్ధికి ప్రణాళికలు జరిగాయి. రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, నాలాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా కార్పొరేషన్ పరిధిలోని మురికి నీరు వ్యర్థాలను శుద్ధి చేసి గోదావరి నదిలోకి వదిలేందుకు ఐదు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు. సీఆర్‌ఆర్, ఎంఆర్‌ఆర్ పథకాల కింద అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయలకు ఖర్చు చేస్తున్నారు. గోదావరిఖని జీఎం ఆఫీస్ సమీపంలో నుంచి రామగుండం బీ పవర్‌హౌస్ వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎల్‌బీనగర్ సెంటర్‌లో నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నది. సిమ్స్ మెడికల్ కళాశాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి మెడికోలు, వైద్య సిబ్బంది రాకపోకలు జరిపేందుకు రాజీవ్ రహదారిపై ఫుట్‌పాత్ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. కలెక్టర్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద వివిధ కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం ద్వారా కార్పొరేషన్ అవసరాలకు వాహనాల కొనుగోళ్లు, రోడ్ల మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనుమతి లభించింది. రామగుండం రైల్వే స్టేషన్ ప్లై ఓవర్ నుంచి పెద్దంపేట మీదుగా అంతర్గాం వెళ్లేందుకు రామగుండం ఫ్లై ఓవర్‌కు అనుసంధానంగా వై ఆర్మ్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్‌టీయూసీ కళాశాల నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ఫోర్‌లేన్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇలా రూ.900కోట్ల నిధులతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బీ పవర్‌హౌస్ సమీపంలోని రామునిగుండాల గుట్టపై 180 అడుగుల ఎత్తుగల ఆంజనేయుని విగ్రహ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ పనులన్నీ మరో సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పనులన్నీ ముగిస్తే రామగుండం ఒక కొత్త రూపును సంతరించుకోనున్నది.
రామగుండం అభివృద్ధికి ’సింగరేణి నిధులు’
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసినా గతంలో రామగుండం అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేది కాదు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పరిశ్రమలు, ప్రభావిత ప్రాంతమైన రామగుండం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఈ ఏడాది కాలంలోనే రామగుండం అభివృద్ధికి సింగరేణి సంస్థ రూ.110కోట్లు మంజూరు చేసింది. గోదావరి తీరాన సమ్మక్క - సారలమ్మ జాతర ప్రాంగణం గోదావరి వరదతో ముంపునకు గురవుతుండడంతో పునర్ నిర్మాణ పనులు చేపట్టారు. సమ్మక్క - సారలమ్మ గద్దెలను పెంచడంతో పాటు వసతి గదులు, ప్రహారి, చుట్టూ సీసీ రోడ్లు, మట్టితో ఎత్తు పెంచడం, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపట్టారు. గోదావరిఖనిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. సుమారు 300షాపులను జనవరిలోగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతుంది. జీఎం ఆఫీస్ జంక్షన్ నుంచి ఆర్‌సీఓఏ క్లబ్, మెయిన్ చౌరస్తా మీదుగా ఫైవింక్లయిన్ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. సింగరేణి కాలనీలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్‌బెడ్‌ను నిర్మిస్తున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవపల్‌మెంట్ సెంటర్‌ను నిర్మించారు. సింగరేణి ఆధ్వర్యంలో క్యాత్ ల్యాబ్ నిర్మిస్తున్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు స్థానిక ప్రజలకు, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేలా ప్రతిపాదనలు చేశారు. ప్రభావిత గ్రామమైన జనగామలో పనులు సాగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, పాఠశాలలకు, ఆర్‌ఓ ప్లాంట్లకు నిధులు కేటాయించారు. సెంటినరీకాలనీ జేఎన్‌టీయూ నుంచి గోదావరిఖని వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోద ముద్ర పడింది.
మన నిధులు మన ప్రాంతంలోనే వెచ్చించాలి...
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
సింగరేణి సంస్థను గత ప్రభుత్వ పెద్దలు సొంత ఖజానాలా వాడుకున్నాయి. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను సిరిసిల్లా, సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్‌కు తరలించుకుపోయారు. పరిశ్రమలు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందే. ఈ ప్రాంత వనరులతో వ్యాపారం చేసే పరిశ్రమలు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు వెచ్చించాలి. సింగరేణి సంస్థ అభివృద్ధికి సహకరిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని నిధులు తీసుకువస్తాం. ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లను కూడా భాగస్వామ్యం చేస్తాం. ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం.
Updated Date - Jun 26 , 2025 | 12:05 AM