rajanna sicicilla : ‘సర్దుబాటు’కు కసరత్తు..
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:45 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) సర్కారు బడుల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండి.. సరిపడా ఉపాధ్యాయులు లేనిచోట ఇతర పాఠశాల నుంచి సర్దుబాటు చేసే ప్రక్రియకు కసరత్తు ప్రారంభించారు.
- విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు
- కలెక్టర్ ఆమోదంతో బదిలీలు.. ఈనెల 15లోపు ప్రక్రియ పూర్తి
- జిల్లాలో 489 పాఠశాలలు.. 2,073 మంది ఉపాధ్యాయులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సర్కారు బడుల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండి.. సరిపడా ఉపాధ్యాయులు లేనిచోట ఇతర పాఠశాల నుంచి సర్దుబాటు చేసే ప్రక్రియకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే ప్రభుత్వం సర్దుబాటు పూర్తిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో సర్దుబాటును వాయిదా వేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్న క్రమంలో తాజాగా ఈనెల 15లోగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రెండు మూడు రోజుల్లోనే కలెక్టర్ ఆమోదంతో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 489 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 337 ప్రాథమిక పాఠశాలలు, 38 ప్రాథమికోన్నత పాఠశాలలు, 114 ఉన్నత పాఠశాలలో ఉన్నాయి. పాఠశాలల్లో 2073మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 750 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 167మంది, ఉన్నత పాఠశాలల్లో 1156మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 31536 మంది విద్యార్థులు చదువుతున్నారు.
గత విద్యా సంవత్సరంలో 140 మంది..
జిల్లాలో 167 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఉన్న విద్యార్థులకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. తాత్కాలిక సర్దుబాటుపై ఉపాధ్యాయులను ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. గత సంవత్సరం 140 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. తాజాగా వివరాలు సేకరిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈసారి 200 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు కానున్నట్లు భావిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1-10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 11-60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 121-150 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు, 151-200 మంది విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులు, 200 మంది విద్యార్థులు దాటిన పాఠశాలలో ప్రతి 40 మందికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు. 6 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1-20 విద్యార్థులకు ఒక లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, ఒక నాన్‌లాంగ్వేజ్ ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేస్తారు. ఒక పంచాయతీ పరిధిలో టీచర్ల సర్దుబాటు అవసరం లేకుంటే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేస్తారు. అక్కడ కూడా అవసరం లేకుంటే మండల పరిధిలో, తర్వాత జిల్లా పరిధిలో సర్దుబాటుకు పరిశీలిస్తారు.
సర్దుబాటుపై వివాదం..
ఉపాధ్యాయులు సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక పాఠశాలలో 60మంది విద్యార్థులు ఉంటే వారికి విద్యాబోధన చేసేందుకు ఇద్దరు ఉపాధ్యాయులతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 18 సబ్జెక్టులు ఇద్దరూ ఎలా బోధిస్తారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. భోజనంతో పాటు విద్యార్థులకు సంబంధించిన రిపోర్టులు, నివేదికలు తయారు చేయాల్సి ఉంటుందని, ఇద్దరు ఉపాధ్యాయులతో ఇతర పనులు ఎలా సాధ్యమవుతుందని అంటున్నారు. విద్యార్థి నిష్పత్తి 1:20 ఉండే విధంగా సర్దుబాటు చేయాలని, 60 మందికి పైగా విద్యార్థులు ఉంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
పాఠశాల కేటగిరి పాఠశాలల సంఖ్య విద్యార్థులు బాలురు బాలికలు
పాథమిక పాఠశాలలు 337 14,371 7,108 7,263
ప్రాథమికోన్నత పాఠశాలు 38 2,055 1,057 998
ఉన్నత పాఠశాలు 114 15,110 8,229 6,881
-------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 489 31,536 16,394 15,142
-------------------------------------------------------------------------------------------------------------------
Updated Date - Jul 10 , 2025 | 12:45 AM