ద్రోణి ప్రభావంతో వర్షాలు
ABN, Publish Date - Mar 21 , 2025 | 11:51 PM
ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెలరోజులుగా 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణః చల్లబడటంతో ఉపశమనం పొందారు.
కరీంనగర్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెలరోజులుగా 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణః చల్లబడటంతో ఉపశమనం పొందారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీయగా, సాయంత్రం ఓ మోస్తరు జల్లులు కురిశాయి. దీనితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చొప్పదండిలో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్‌లోని మక్కలు తడిసిపోయాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు గంగాధర, రామడుగు, మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. జిల్లా సగటు వర్షపాతం 1.70 మి.మీ.గా నమోదు కాగా అత్యధికంగా చొప్పదండి మండలం వెదరుగట్టలో 29.3 మి.మీ. వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే వరి, మొక్కజొన్న పంటలు మరికొన్నిరోజుల్లో చేతికొచ్చే సమయంలో అకాలవర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Mar 21 , 2025 | 11:51 PM