ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:32 AM
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని లింగాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.
మానకొండూర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని లింగాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాద్యాయుల సమావేశానికి కచ్చితంగా హజరు కావాలని సూచించారు. అప్పుడే పిల్లల చదువు తీరును తెలుసుకోవచ్చన్నారు. ఐదో తరగతి విద్యార్థులపై అత్యంత శ్రద్ధ అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లింగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు వివిధ ప్రైవేటు పాఠశాలల నుంచి 35 మంది విద్యార్థులు రావడం గొప్ప విషయమన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆమె అభినందించారు. లింగాపూర్‌లో ఐదేళ్లు నిండిన అంగన్‌వాడీ చిన్నారులు మొత్తం మంది పాఠశాలలో చేరడం సంతోషదాయకమన్నారు. ఏడో తరగతి పూర్తి చేసిన నూరు శాతం విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరడంపై అభినందించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రెండో తరగతి విద్యార్థినితో న్యూస్ పేపర్ చదివించారు. పలువురు విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలను కలెక్టర్‌కు వివరించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాభోదన చేయాలని ఉపాద్యాయులకు కోరారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టి దశల వారీగా బిల్లులు తీసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో క్వాలిటీ కో-ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంఈవో మధుసూదన్, హెచ్‌ఎం శ్రీనివాస్ జియ్యంగార్, స్కూల్ కాంప్లెక్స్ ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:32 AM