రాజన్న ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆందోళన
ABN, Publish Date - Jun 16 , 2025 | 12:46 AM
రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తించే ఇద్దరు అధికారుల వేధింపులతోనే తన కొడుకు మృతిచెందాడని మృతుడి తల్లి పెంట లక్ష్మీ బంధువులు, కాలనీవాసులతో కలిసి ఈవో కార్యాలయం ఎదుట ఆదివారం ఆందోళన నిర్వహించారు.
వేములవాడ కల్చరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తించే ఇద్దరు అధికారుల వేధింపులతోనే తన కొడుకు మృతిచెందాడని మృతుడి తల్లి పెంట లక్ష్మీ బంధువులు, కాలనీవాసులతో కలిసి ఈవో కార్యాలయం ఎదుట ఆదివారం ఆందోళన నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో ఇంజనీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న పెంట ఓంకార్(30) 15 రోజులు క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ విభాగంలోని ఓ ఉద్యోగి తన స్వంత పనులకు ఓంకార్‌ను వాడుకున్నారని, మరో ఉద్యోగి ఓంకార్‌ను విధులకు రావడం లేదని గైర్హాజర్ వేసి ఉద్యోగం నుంచి తొలగిస్తామని వేధింపులకు పాల్పడటమే కాకుండా రాతపూర్వకంగా క్షమాపణ పత్రం రాయించుకున్నారు. మనస్థాపానికి గురైన ఓంకార్ మే 30వ తేదిన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి తల్లి ఆదివారం ఈవో కార్యాలయం ఎదుట బంధువులు, కాలనీవాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆలయాధికారులు అక్కడకు చేరుకుని బాధితులకు నచ్చజెపేందుకు ప్రయత్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఈవో శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసి ధర్నాను విరమించారు.
Updated Date - Jun 16 , 2025 | 12:46 AM