పదోన్నతులు.. ఉత్కంఠ..
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:16 AM
ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈనెల 2 తేదీన ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ 11వ తేదీ వరకు కొనసాగనుంది.
- మొదలైన ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ
- బదిలీల తర్వాతే ఇవ్వాలని హైకోర్టులో కేసు
- రేపు హైకోర్టు విచారణపై ఆసక్తి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈనెల 2 తేదీన ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ 11వ తేదీ వరకు కొనసాగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 200 వరకు ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను పరిగణనలోకి తీసుకొని పదోన్నతుల జాబితాలో సీనియర్ ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 3867 మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 100 మంది వరకు ప్రమోషన్ల ప్రయోజనం కలుగుతోంది. జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు ఫైనల్ జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఫ పదోన్నతులకు బ్రేక్ పడుతుందా....
ఉపాధ్యాయ పదోన్నతుల సంబరానికి బ్రేక్ పడుతుందా..? కొనసాగుతుందా..? అనే ఉత్కంఠ ఉపాధ్యాయుల్లో మొదలైంది. బదిలీల తర్వాత పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా పదోన్నతుల షెడ్యూలు విడుదల చేసింది. కొందరు ఉపాధ్యాయులు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును మంగళవారం రోజుకు వాయిదా వేసింది. హైకోర్టు పదోన్నతులు నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసి బదిలీలకు ఆదేశాలు ఇస్తే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు నిరాశ తప్పదని భావిస్తున్నారు. హైకోర్టు నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల్లో కొందరు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లారు. ఇప్పటికీ ఇతర జిల్లాలోనే వారు పని చేస్తున్నారు. సొంత జిల్లాలో ఖాళీలు ఏర్పడడంతో ఇతర జిల్లాల్లో ఉన్నవారు రావాలని భావిస్తున్నారు. పదోన్నతులు ఇస్తే ఇతర జిల్లాలకే పరిమితం కావాల్సి ఉంటుందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించడంతో మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయని ఆసక్తి ఉపాధ్యాయులు ఏర్పడింది.
ఫ జిల్లాలో వంద మందికి ప్రమోషన్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2493 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్న వారిలో 100 మంది వరకు పదోన్నతుల ప్రయోజనం పొందనున్నారు. 17మంది స్కూల్‌అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా, 87మంది ఎస్‌జీటీలు పదోన్నతి పొందనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే జిల్లాలోని ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. వీటిపై అభ్యంతరాలను ఉంటే వ్యక్తం చేయవచ్చు. 4,5 తేదీల్లో స్కూల్‌అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 1:3లో ఉపాధ్యాయులను ఎంపిక చేసి సీనియార్టీ ప్రకారం ఒకరిని పదోన్నతి జాబితాలో చేరుస్తారు. 6వ తేదీన స్కూల్‌అసిస్టెంట్స్‌కు జీహెచ్‌ఎంలుగా పదోన్నతులపై వెబ్‌ఆప్షన్లను స్వీకరిస్తారు. 7న పదోన్నతి పొందిన వారికి ఉత్తర్వులు జారీ చేస్తారు. 8,9వ తేదీల్లో పదోన్నతులు వచ్చిన గ్రేడ్-2 హెచ్‌ఎంల పేర్లను ప్రదర్శిస్తారు. తుది జాబితాను వెల్లడిస్తారు. ఎస్‌జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ జాబితా తయారుచేసి పదోన్నతులు కల్పిస్తారు. 10వ తేతీన ఎస్‌జీటీలకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఈనెల 11న జిల్లా కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన టీచర్లకు ఉత్తర్వులను అందిస్తారు.
Updated Date - Aug 04 , 2025 | 01:16 AM