గురుకులాల్లో ‘ఫోన్‌మిత్ర’
ABN, Publish Date - Jul 02 , 2025 | 01:25 AM
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కొత్తగా ఫోన్‌మిత్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక విద్యార్థులు ఇంటిపై బెంగపెట్టుకోకుండా తమ తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు.
భగత్‌నగర్, జులై 1 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కొత్తగా ఫోన్‌మిత్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక విద్యార్థులు ఇంటిపై బెంగపెట్టుకోకుండా తమ తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు. గురుకులంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఈ ప్రక్రియ ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే అమలయ్యే విధంగా సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చర్యలు చేపట్టింది. ఈ మేరకు గురుకులాల్లో ఫోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. కొన్ని గురుకులాల్లో ఫోన్లను ఇప్పటికే బిగించగా మిగిలిన గురుకుల విద్యాలయాల్లో వేగవంతం చేశారు.
ఫ నలుగురు విద్యార్థులకు ఒక స్మార్ట్‌కార్డు
గురుకుల విద్యార్థులు హౌజ్ మాస్టర్ తో సంబంధం లేకుండా నేరుగా స్మార్ట్‌కార్డు ఆధారంగా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. నలుగురు విద్యార్థులకు కలిపి ఒక్కో స్మార్ట్ కార్డు అందజేస్తారు. ఆ కార్డుతో నిర్దేశించిన సమయంపాటు తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు. ఇష్టం వచ్చిన నంబర్లకు కాకుండా కుటుంబ సభ్యులకు చెందిన ఒక ఫోన్ నంబరు మాత్రమే కాల్ వెళ్తుంది. వేరే ఇతర ఫోన్ నంబర్లకు కాల్ చేయడానికి అవకాశం ఉండదు. గురుకుల విద్యాలయాల సంస్థ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గురుకులంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత ఉన్నతాధికారులకు విన్నవించే అవకాశం ఫోన్ మిత్ర ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి ఇప్పటి వరకు క్లాస్ హౌస్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ అడిగాల్సి ఉండేది. లేదా ఎవరైనా పేరెంట్ గురుకులానికి వెళ్తే వారిని బతిమాలి ఫోన్ చేసేవారు.
ఫ విద్యార్థుల సంఖ్య మేరకు ఫోన్లు
గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఫోన్లను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల సంఖ్య మేరకు స్మార్ట్ కార్డులు గురుకులాలకు సరఫరా అయ్యాయి. అవసరమైతే మరిన్ని స్మార్ట్ కార్డులు, ఫోన్లను అందజేయడానికి గురుకుల సొసైటీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరిగా సంక్షేమ గురుకులాల్లోనూ ఫోన్లు ఏర్పాటు చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 02 , 2025 | 01:25 AM