పెన్షన్.. పరేషాన్..
ABN, Publish Date - May 02 , 2025 | 01:13 AM
వృద్ధాప్య పింఛన్‌దారులు ఒకరు చనిపోతే కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ అర్హులైన ఇతరులకు పింఛన్ మంజూరుచేసే పక్రియ మాత్రమే కొనసాగుతుంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వృద్ధాప్య పింఛన్‌దారులు ఒకరు చనిపోతే కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ అర్హులైన ఇతరులకు పింఛన్ మంజూరుచేసే పక్రియ మాత్రమే కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. గత ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటి స్థానంలో చేయూత పథకం ప్రకటించినా అర్హులకు నిరీక్షణ తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు గ్యారంటీలకు 1.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ప్రధానంగా పింఛన్ కోసం 76,501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చేయూత పింఛన్‌కు 71,677 మంది, దివ్యాంగులు 4,824 మంది దరఖాస్తులు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల్లో ఒకటిగా ప్రకటించినా కాంగ్రెస్ పింఛన్ సొమ్ము సాధారణ పింఛన్‌దారులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. పెంచడంతో పాటు అర్హులైన వారందరికి పింఛన్లు మంజూరుచేస్తామని స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలిగే తీరు మాత్రం కనిపించడం లేదు. దాదాపు 15 నెలలు గడిచిపోయినా పింఛన్ల ఊసే ఎత్తడం లేదు.
మూడేళ్లుగా ఎదురుచూపులు..
జిల్లాలో పింఛన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో ఒకసారి మాత్రమే కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో చాలా మందికి రాలేదని ఎదురుచూశారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తుల స్వీకరణతో హాడావిడి చేసినా పింఛన్ మాత్రం అందడం లేదు. వృద్ధాప్య పింఛన్లు మాత్రం ఒకరు మరణిస్తే ఒకరికి అందిస్తున్నారు. ఇలా జిల్లాలో 2,476 మందికి మంజూరు చేశారు. అందులో బోయినపల్లిలో 195, చందుర్తిలో 210, ఇల్లంతకుంటలో 251, గంభీరావుపేటలో 221, కోనరావుపేట 230, ముస్తాబాద్‌లో 270, రుద్రంగిలో 59, తంగళ్లపల్లిలో 210, వీర్నపల్లిలో 45, వేములవాడలో 60, వేములవాడ రూరల్‌లో 132, ఎల్లారెడ్డిపేటలో 232, సిరిసిల్లలో 236, వేములవాడ మున్సిపాలిటీలో 125 బదలాయింపు ఫించన్లు మంజూరయ్యాయి.
జిల్లాలో 1.17 లక్షల పింఛన్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ప్రస్తుతం లక్షా 17 వేల 902 పింఛన్‌దారులకు ప్రతినెలా రూ.25.84కోట్లు పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 31,870, దివ్యాంగుల పింఛన్లు 9,739, వితంతువు 24,007, చేనేత 3,518, గీతా కార్మికులు 2,255, ఒంటరి మహిళలు 1,808, బీడీ కార్మికులు 43,206, పైలేరియా 964, డయాలసిస్ పేషేంట్లు 65, బీడీ టేకేదార్లు 470 మంది ఉన్నారు.
జిల్లాలో మొత్తం పింఛన్‌దారులు మండలాల వారీగా
మండలం పింఛన్‌దారులు
గంభీరావుపేట 11,385
ముస్తాబాద్ 10,625
సిరిస్లిల మున్సిపల్ 21,752
తంగళ్ళపల్లి 10,454
వీర్నపల్లి 2,126
ఎల్లారెడ్డిపేట 11,212
చందుర్తి 7,003
కోనరావుపేట 9,282
రుద్రంగి 2,905
వేములవాడ 3,370
వేములవాడ రూరల్ 5,439
వేములవాడ మున్సిపల్ 7,236
బోయినపల్లి 6,824
ఇల్లంతకుంట 8,289
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,17,902
--------------------------------------------------------------------------------------------------
Updated Date - May 02 , 2025 | 01:13 AM