peddapally : ప్రభుత్వ భూములకు రక్షణ కరువు
ABN, Publish Date - May 19 , 2025 | 12:44 AM
మంథని, మే 18 : మంథని పట్టణ శివారులో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల రక్షణ కరువైంది. విలువైన రెవెన్యూ, దేవాదాయ, నదినాలా భూములను గుంటలు, ఎకరాల చొప్పున ఇష్టారీతిగా కబ్జాలకు పాల్పడుతున్నారు.
రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం
మంథని, మే 18 : మంథని పట్టణ శివారులో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల రక్షణ కరువైంది. విలువైన రెవెన్యూ, దేవాదాయ, నదినాలా భూములను గుంటలు, ఎకరాల చొప్పున ఇష్టారీతిగా కబ్జాలకు పాల్పడుతున్నారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారికి అనుకొని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి క్రాస్ రోడ్డు పక్కనే ఉన్న గైరాన్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. పాత పెట్రోల్ పంపు క్రాస్ శివారులోని మంథని-కాటారం ప్రధాన రహదారి పక్కనే బొక్కలవాగును అనుకొని ఉన్న నదినాలా, రెవెన్యూ, సూరయ్యపల్లి గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించు కుంటున్నారు. శ్రీపాదకాలనీలోని ప్రభుత్వ భూమిని, మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న కూచిరాజ్‌పల్లి శివారులోని ప్రభుత్వ భూములను సైతం కబ్జాలు చేస్తున్నారు. పెద్దపల్లి రోడ్‌లోని శ్రీవాగుఒడ్డు పోచమ్మ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాలు, నదినాలా భూములను సైతం కొందరు కబ్జా చేయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. గంగాపురి బస్టాంప్ సమీపంలోని బొక్కలవాగు ఒడ్డు ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది.
ఫ డిమాండ్ పెరుగడంతో కబ్జాకోరుల కన్ను
కొద్ది సంవత్సరాలుగా మంథని పట్టణ విస్తరణ రియల్ ఎస్టేస్ కారణంగా వేగంగా పెరుగుతుండటంతో ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో భూములకు డిమాండ్ వచ్చింది. దీంతో ఈ భూములకు బహిరంగ మార్కెట్‌లో గుంటకు లక్షలాది రూపాయల పైనే డిమాండ్ ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మంథని-కాటారం, మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారులకు అనుకొని ఉన్న భూములకు డిమాండ్ రావడంతో పాటు పట్టణ విస్తరణ పెరుగుతుండటం, వెంచర్లు పాట్లు చేస్తుడటంతో ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతుంటే, మరొకొందరు ప్రభుత్వ భూముల పక్క ఉన్న భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ భూములను సైతం తెలివిగా కబ్జా చేస్తున్నారు. ఇందులో అత్యంత విలువైన కోట్ల విలువ చేసే గైరాన్ భూములను సైతం కొందరు కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి.
ఫ ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలు
కొందరు తమకు ఈ భూములకు పట్టాలు ఉన్నాయంటూ క్రయవిక్రయలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత భూమి క్రయవిక్రయాల్లో పలువురి పేరిట పట్టాలు, రిజిష్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్ అధికారులు తమ శాఖలకు చెందిన భూములను కబ్జాలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పెట్టినా కబ్జాదారులు పట్టించుకోవడం లేదు. కొందరు ఏకంగా ఆక్రమణ భూముల్లో ఫెన్సింగ్ వేసుకోవడంతో పాటు మరి కొందరు ఏకంగా భవనాలు నిర్మిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో భూములను మెల్లమెల్లగా ఆక్రమ ణలకు పాల్పడుతున్నారు. ఆయా శాఖల అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. గత పదేళ్లుగా ఈతంతు కొనసాగుతున్నా పట్టించునే వారే కరువ య్యారు. గుంటకు లక్షలల్లో ధర పలికే ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడం, కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో వివిధ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంగా పట్టణ శివారులోని ప్రభుత్వ భూములను సమగ్రంగా గుర్తించి అవి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వీటిని ప్రభుత్వ, ప్రజల అవసరాల కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 19 , 2025 | 12:44 AM