peddapally : స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:53 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) స్థానిక సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సత్తా చాటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
- క్షేత్రస్థాయిలో కేడర్‌ను అప్రమత్తం చేస్తున్న అధిష్ఠానం
- నియోజకవర్గాల వారీగా మొదలైన సమావేశాలు
- గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటున్న పార్టీ
- ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సత్తా చాటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యకర్తలను పార్టీ పెద్దలు అప్రమత్తం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 90 శాతానికి పైగా స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.
జిల్లాలో 14 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఏదాదిన్నర క్రితం ముగియగా, మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ఏడాది క్రితం ముగిసింది. మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి నెలాఖరులో ముగిసింది. అన్నింటి లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఎటూ తేలకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడుగులు ముందుకు పడడం లేదు. బీసీ కులగుణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపించింది. చట్టపరంగా ఆమోదం పొందకపోయినా పార్టీ పరంగా 42 శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను సత్వరమే నిర్వహించాల ని కొందరు మాజీ సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. సెప్టెంబరు నెలాఖరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లపై ఎలా ముందుకు పోవాలని ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఏదీ ఎలా ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు మూడునెలల్లో ఎన్నికలు పూర్తికావడం ఖాయంగా కనబడుతున్నది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిగితే జనరల్ స్థానాల్లో కూడా బీసీలు, ఎస్సీలు పోటీచేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీలో ఉంటున్నామని అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయావర్గాలను కలుస్తూ తమ మద్దతు కావాలని కోరతున్నారు.
- నియోజకవర్గాల స్థాయి సమావేశాలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పది, పదిహేను రోజుల్లో రిజర్వేషన్ల విషయమై తేల్చి వరుసగా ఆయా ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. ఈక్రమంలో తమ పార్టీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నది. నియోజకవర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ సన్నద్ధం చేస్తున్నారు. ఆదివారం పెద్దపల్లి నియోజకవర్గస్థాయి సమావేశాలు జరిగాయి. ముందుగా ఏ ఎన్నికలు జరిగినా అందుకు సంసిద్ధంగా ఉండాలని పార్టీ కోసం పనిచేసే వారికి, గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తుందని, ఈ పర్యాయమే గాకుండా మరో ఐదేళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేలా అధిష్ఠానం పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితేనే మూడున్నరేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రాగలుగుతుందని పార్టీ నాయకులు క్య్డాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానికసంస్థల ఎన్నికలు మూడు నెలల్లోగా పూర్తికావడం ఖాయం అని తేలిపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం అవుతున్నారు. పార్టీ టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేలను కాకా పడుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత, ఆ రిజర్వేషన్లను బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
Updated Date - Jun 30 , 2025 | 12:53 AM