భూ భారతిలో తప్పుల సవరణకు అవకాశం
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:21 AM
రైతుల భూములకు సంబంధించి పాస్ పుస్తకాల్లో పొరపాట్ల, తప్పుల సవరణకు భూభారతి చట్టంలో అవకాశం కల్పించారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
చొప్పదండి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రైతుల భూములకు సంబంధించి పాస్ పుస్తకాల్లో పొరపాట్ల, తప్పుల సవరణకు భూభారతి చట్టంలో అవకాశం కల్పించారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం చొప్పదండిలో భూ భారతి చట్టం-2025 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు భూముల పై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించునుందని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ నవీన్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్, వ్యవసాయ ఏడీ ప్రియదర్శిని, మండల ప్రత్యేక అధికారి తిరుపతిరావు, ఏవో వంశీకృష్ణ, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి ,పద్మాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కార్మికుల పిల్లలను పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాలి
వలస కార్మికుల పిల్లలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో చేరే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని గుమ్లాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు కార్మికులుగా మారకూడదని ఉద్దేశంతోనే జిల్లాలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సందర్బంగా ఆమె కార్మికుల పిల్లలతో హిందీ, ఒడియా భాషల్లో ముచ్చటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంఈవో శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు జి వీరేశం, శ్రీలత పాల్గొన్నారు.
ఫ మహిళలు పోషకాహారం తీసుకోవాలి
ప్రతి మహిళ తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణపక్షం ముగింపు ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో వండిన ఆహారం తీసుకోవాలన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. పోషకాహారం ఇవ్వడంతోపాటు కార్పొరేట్‌కు ధీటుగా విద్యను నేర్పుతున్న అంగన్‌వవాడీ కేంద్రాల్లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరిని చేర్పించాలని సూచించారు. అనంతరం అంగన్వాడి పిల్లలకు ప్రీస్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. గర్భిణులకు సీమంతాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, సీడీపీవో నర్సింగారాణి, ప్రత్యేక అధికారి తిరుపతిరావు, డీసీపీవో పర్వీన్, తహసీల్దార్ నవీన్ కుమార్, మెడికల్ ఆఫీసర్ శ్రీకీర్తన, సూపర్వైజర్ శశికుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 12:21 AM