బల్దియా జాగా కబ్జా
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:04 AM
జగిత్యాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రోడ్లను ఆనుకొని ఉన్న మున్సిపల్, సర్కారు భూములు కబ్జాకు గురవుతున్నాయి. మొదట్లో చిరు వ్యాపారాల ముసుగులో పాగా వేసిన కొందరు, క్రమంగా వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా షెడ్ల నిర్మాణం చేపట్టి కొందరు సొంత వ్యాపారం చేసుకుంటుండగా, మరికొందరు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
-జిల్లా కేంద్రంలో మున్సిపల్ భూమి అన్యాక్రాంతం
-వందకు పైగా షెడ్లు వేసి వ్యాపార సముదాయాల నిర్వహణ
-పట్టించుకోని అధికారులు, పాలక వర్గాలు
జగిత్యాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రోడ్లను ఆనుకొని ఉన్న మున్సిపల్, సర్కారు భూములు కబ్జాకు గురవుతున్నాయి. మొదట్లో చిరు వ్యాపారాల ముసుగులో పాగా వేసిన కొందరు, క్రమంగా వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా షెడ్ల నిర్మాణం చేపట్టి కొందరు సొంత వ్యాపారం చేసుకుంటుండగా, మరికొందరు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి నెల షాప్ విస్తీర్ణం బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె వసూలు చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆక్రమణదారులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు సైతం ఒత్తిళ్లకు తలోగ్గి ఆక్రమణల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్, ప్రభుత్వ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ శాఖలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫగొల్లపల్లి రోడ్డులో అక్రమంగా వ్యాపార సముదాయాలు
జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్డులో ఎడమ వైపు రోడ్డు పక్కన ఉన్న షెడ్లన్నీ అక్రమంగా చేపట్టిన నిర్మాణలేనన్న ఆరోపణలున్నాయి. వీటి ద్వారా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఇక్కడ తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్న కొందరు అక్కడి నుంచి కదలడం లేదు. టీస్టాల్స్, పండ్ల దుకాణదారులు, కేఫ్‌లు నిర్వహిస్తున్న వారు ఇలా చాలా మంది చిరు వ్యాపారులు ఆక్రమణదారులకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండడం, హాస్పిటల్ జోన్ కారణంగా అక్రమంగా వెలిసిన దుకాణాలతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆక్రమణకు గురైన దుకాణాలు ఖాళీ చేయించడంతో పాటు మరో చోట స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఫమున్సిపల్ పార్క్ స్థలం సైతం కబ్జా
జగిత్యాలలోని కొత్త బస్టాండ్ ఇన్‌గేట్‌కు ఎదురుగా ఉన్న మున్సిపల్ పార్క్ స్థలం సైతం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇక్కడ ఉన్న మున్సిపల్ భూమిలో కొందరు వ్యక్తులు 20 వరకు షెడ్లు వేసి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత భూముల విలువ పెరగడంతో పాటు, బస్టాండ్‌కు సమీపంగా ఉండడం, వ్యాపారానికి అడ్డా కావడంతో కబ్జాదారులు ఆక్రమించుకున్న దుకాణాలను అద్దెకు ఇస్తూ వేల రూపాయల వసూలు చేసుకుంటున్నారు. ఒక సాధారణ వ్యక్తి విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకుంటే ధ్రువపత్రాల లేకుటే మీటర్లు ఇవ్వని విద్యుత్ అధికారులు ఆక్రమించిన షెడ్లు, టేలలకు ఏ విధంగా అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకున్న కొందరు వ్యక్తులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతోనే అధికారులు ఆ భూముల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫకమర్షియల్ కాంపెక్స్‌లు నిర్మిస్తే భారీగా ఆదాయం
జిల్లా కేంద్రంలో మున్సిపల్ భూములతో పాటు, ఖాళీగా ఉన్న ఆర్టీసీ, ఇతర రెవెన్యూ భూములను గుర్తించి కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విధానం అవలంబించడం ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని, కబ్జాలకు గురి కాకుండా ఉంటాయని జగిత్యాల వాసులు కోరుతున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో కబ్జా స్థలాల్లో కమర్షియల్ కంప్లెక్స్ నిర్మించి, టెండర్ ద్వారా కేటాయింపు జరిపితే మున్సిపల్‌కు ఆదాయం పెరగడంతో పాటుగా, స్థలాలు మున్సిపల్ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఆక్రమణలు మా దృష్టికి రాలేదు
-స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల
పట్టణంలోని గొల్లపల్లి రోడ్డు వైపు, బస్టాండు సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యవహారం మా దృష్టికి రాలేదు. కొన్ని సంవత్సరాలుగా గొల్లపల్లి రోడ్డు, బస్టాండు సమీపంలో వందలాది మంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పర్మనెంట్ దుకాణాలు నిర్మించుకున్న వ్యవహారంపై పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
Updated Date - Jun 06 , 2025 | 01:04 AM