బడిలో సెల్‌ఫోన్‌కు ఇక చెల్లుచీటి
ABN, Publish Date - May 08 , 2025 | 12:18 AM
పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
జగిత్యాల, మే 7 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగించకుండా చూడాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జిల్లా అధికారులు స్కూళ్లను తనిఖీ చేసి, సెల్‌ఫోన్ వాడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. దీంతో విద్యాశాఖ వర్గాల్లో పాఠశాలల్లో సెల్‌ఫోన్ వాడకంపై విస్తృతంగా చర్చలు చోటుచేసుకుంటున్నాయి.
జిల్లాలో 844 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పరిధిలో 844 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 518, ప్రాథమికోన్నత పాఠశాలలు 90, ఉన్నత పాఠశాలలు 236 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 66 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 4 వేల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే కొద్దిమంది స్కూల్‌కు వచ్చినా నిరంతరం ఫోన్‌లో మునిగితేలుతున్నారని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లినపుడు కొందరు టీచర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతుండడం చూసి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయుల మూలంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం సడలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు బడిలో సెల్‌ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వాడకూడదని, ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈమేరకు తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారి రాము ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.
ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు..
బడిలో సెల్‌ఫోన్ వాడొద్దన్న విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలపై ఉపాధ్యాయులు భిన్నంగా స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్ వాడకుండా ఉండడమే మంచిదని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో కాల్ వస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే స్కూల్‌లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల హాజరు విషయంలో ఫేస్ రికగ్నైజేషన్‌కు సెల్‌ఫోన్ వాడాల్సి ఉంటుందంటున్నారు. చాలా సమాచారం ఫోన్ల ద్వారానే పంపుతామని పేర్కొంటున్నారు. సెల్‌ఫోన్ వాడద్దంటే ఈ పనులన్నీ ఎలా చేయాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫేస్ రికగ్న్జేజేషన్, ఆన్‌లైన్ వర్క్స్ కోసం ట్యాబ్‌లు గానీ, ఇతర పరికరాలు అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిషేధం సమంజసమే..
-యాళ్ల అమర్‌నాథ్ రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
బోధించే సమయంలో ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్ మోగినట్లయితే తరగతి గదిలో ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. సెల్‌ఫోన్ నిషేధం సమంజసమే. ప్రతీ పాఠశాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించినట్లయితే డిజిటల్ బోధనకు సెల్‌ఫోన్ ద్వారా నెట్ వాడడం ఉండదు. తద్వారా గదిలోకి సెల్ తీసుకొని పోవడాన్ని అరికట్టవచ్చు.
అవసరం మేరకు సెల్ వాడడం మంచిది
-అనిత, కవయిత్రి, ఉపాధ్యాయురాలు, జగిత్యాల
పాఠశాలలో ఉపాధ్యాయులు అదే పనిగా సెల్‌ఫోన్ వాడడం వల్ల బోధనలో ఇబ్బంది కలగడం వాస్తవమే.. కానీ మొత్తానికి సెల్ నిషేధం అంటే కష్టమే. పాఠశాలకు సంబంధించిన పలు పనులు, నివేదికలను ఫోన్ ద్వారానే పంపవలసి ఉంటుంది. బాల గేయాలు, రైమ్స్, కథలు లాంటివి నేర్పాలన్న ప్రొజెక్టర్లు లేని పాఠశాలలు సెల్‌ఫోన్లు అవసరమే.
నిషేధంపై ఆదేశాలు జారీ చేశాం
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు తగిన మార్గదర్శకాలిచ్చాం. వచ్చే విద్యా సంవత్సరం అన్ని వర్గాల సమన్వయంతో ఈ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తాం.
Updated Date - May 08 , 2025 | 12:18 AM