ఈ-శ్రమ్‌పై నిర్లక్ష్యం
ABN, Publish Date - May 21 , 2025 | 01:19 AM
అసంఘటిత రంగ కార్మిక వర్గాలకు ఎన్నో ప్రయోజనాలతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనాసక్తి కనబడుతోంది. కార్మికుల్లో అవగాహన కల్పించడంలోనూ విఫలమవుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అసంఘటిత రంగ కార్మిక వర్గాలకు ఎన్నో ప్రయోజనాలతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనాసక్తి కనబడుతోంది. కార్మికుల్లో అవగాహన కల్పించడంలోనూ విఫలమవుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. నాలుగేళ్లు దగ్గర పడుతున్నా ఈ-శ్రమ్ నమోదు నామమాత్రంగానే ఉంది. 2021 ఆగస్టు నుంచే ఈ-శ్రమ్ నమోదు ప్రక్రియ మొదలైనా నిర్లక్ష్యంగానే కొనసాగుతోంది. 16 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రమజీవులందరూ ఈ-శ్రమ్ నమోదుకు అర్హులు. ఈ-శ్రమ్‌లో చేరిన కార్మికులకు 12 అంకెల ప్రత్యేక యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబరుతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్డును అందిస్తుంది. నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద కార్మికుడు మరణించినా, ప్రమాదాల్లో అంగవైకల్యం చెందిన బీమా సౌకర్యం వర్తిస్తుంది. కేంద్ర బడ్జెట్‌లోనూ ఈ-శ్రమ్‌పై ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. అసంఘటిత రంగ కార్మికులకు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలు వర్తింపజేయడానికి ప్రామాణికంగా ఉంటుంది. ఇందులో వ్యవసాయ కూలీలు, అడ్డా కూలీలు, మత్స్యకారులు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు వడ్డెరులు, సెంట్రింగ్, ప్లంబింగ్, సానిటరీ, పెయింటింగ్, ఎలక్ర్టీషియన్, వెల్డింగ్, ఇటుక బట్టీ, మరమగ్గాలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఉపాధిహామీ కూలీలు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, పాడి రైతులు, ఆటోడ్రైవర్లు, కూరగాయల, పండ్ల విక్రేతలు, టైలరింగ్, స్వర్ణకారులు, బ్యూటీపార్లర్‌లో పనిచేసే కార్మికులు, కొరియర్‌బాయ్స్, విద్యావలంటీర్లు ఇలా వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు ఈ-శ్రమ్‌కు అర్హులే. ఈపీఎఫ్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ లేనివారందూ నమోదు చేసుకునే వీలు ఉంది.
ఫ జిల్లాలో 68,739 మంది నమోదు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,52,037 మంది జనాభా ఉండగా, కార్మికులు 2 లక్షల 98 వేల 663 మంది ఉన్నారు. ఇందులో ప్రధాన కార్మికులు 2,53,918 మంది ఉన్నారు. వీరిలో వ్యవసాయ రంగంలో రైతులు 66,751 మంది, వ్యవసాయ కూలీలు 1,01,737 మంది, కుటీర పరిశ్రమ కార్మికులు 46,647 మంది, ఇతర రంగాల్లో 83,528 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు 68,739 మంది ఈ-శ్రమ్‌పై నమోదు చేసుకున్నారు. ఎస్‌ఎస్‌కే ద్వారా 693మంది, సీఎస్‌సీ ద్వారా 35,940, వ్యక్తిగత రిజిస్ట్రేషన్లు 32,057, మేనేజ్‌మెంట్‌ల ద్వారా 18 మంది నమోదయ్యారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన కార్మికులే ఎక్కువగా నమోదయ్యారు. 36,579 మంది వ్యవసాయానికి సంబంధించిన వారిలో ఉండగా, వ్యవసాయ కార్మికులు 27,814 మంది ఉన్నారు. నమోదు తరువాత కార్మికుల లెక్కలు కూడా ప్రత్యేకంగా ఉండేందుకు డేటా బేస్ కూడా ఏర్పాటు చేశారు. ఈ-శ్రమ్‌పోర్టల్‌లో కార్మికుల నమోదు కూడా ఉచితంగానే చేస్తారు. అన్ని కామన్ సెంటర్‌లలో నమోదు చేసుకునే వీలు కల్పించారు. జిల్లాలో మాత్రం నత్తనడకగానే సాగుతోంది.
Updated Date - May 21 , 2025 | 01:19 AM