ఇక అందంగా పట్టణాలు
ABN, Publish Date - May 03 , 2025 | 12:37 AM
పట్టణాల సుందరీకరణలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన అమృత్ మిత్ర పథకం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
- మహిళా సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో సుందరీకరణ
- ‘అమృత మిత్ర’ పథకంతో మున్సిపాలిటీల్లో అమలు
- తాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్ల బాధ్యతల అప్పగింత
- సర్క్యులర్ జారీ చేసిన అధికారులు
- జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో అమలుకు కసరత్తులు
జగిత్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): పట్టణాల సుందరీకరణలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన అమృత్ మిత్ర పథకం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంటిని చక్కబెట్టినట్టె....మహిళలను భాగస్వామ్యులను చేస్తే మున్సిపాలిటీలను కూడా చక్కదిద్దుతారని భావిస్తున్నారు. మహిళల మద్దతుతో పట్టణాలు అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని సరిదిద్దే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో అమృత్ మిత్ర పథకం అమలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు.
చేయాల్సిన పనులు....
మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన అమృత్ మిత్రలు చేయాల్సిన పనులను ముందుగానే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులతో చేపట్టే పనులను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెండు లక్షల రూపాయల నుంచి రూ. 10 లక్షల వరకు నిధుల వినియోగం కోసం ప్రాజెక్టును ఎంపిక చేస్తారు. సింగిల్ టెండర్ పద్ధతిన స్వయం సహాయక సంఘాలకు పనులు అప్పగిస్తారు. ఇలా సంవత్సరంలో 30 లక్షల రూపాయల మేర నిధులు వెచ్చించి పనుల నిర్వహణపై సంఘాలకు గ్రేడింగ్‌లు ఇస్తారు. ప్రధానంగా తాగునీటి సరఫరా, వినియోగం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీటర్ రీడింగ్, నీటి సరఫరా పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. తాగునీటి పరిశుభ్రత, పైపుల లీకేజీలను సరిచేయించడం, పారిశుధ్య పనుల పర్యవేక్షణ, మొక్కలు నాటడం, పట్టణ సుందరీకరణలో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్కులను ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలి. పట్టణంలో వాల్ పెయింటింగ్‌తో తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత, సంస్కృతిసంప్రదాయాల పరిరక్షణ, మొదలైన అంశాలను తెలిపేలా అందమైన పెయింటింగ్ వేయించి ప్రజల్లో చైతన్యం తేవాల్సి ఉంటుంది. ఈ పనులు చేసినందుకు అమృత మిత్రలకు పారితోషికం అందజేస్తారు. అయితే నిధుల వినియోగం, స్వయం సహాయక సంఘాలకు పని కల్పించడంతో పాటు, పనికి తగిన పారితోషికం కూడా ఇవ్వడంతో సభ్యులు మరింత బాధ్యతగా పనిచేస్తారని అధికారులు చెబుతున్నారు.
అమృత్ మిత్రల ఎంపిక ఇలా....
పట్టణాభివృద్ధిలో స్వయం సహాయక సంఘాల (మెప్మా) సహకారం, అమృత్ 2.0 నిధుల వినియోగం చేసేందుకు మున్సిపాలిటీల్లో అమృత్ మిత్రలను ఎంపిక చేయనున్నారు. పట్టణంలోని జనాభా, స్వయం సహాయక సంఘాలు, అందులో సభ్యుల సంఖ్యతో పాటు, పేదలు నివసించే ప్రాంతాలు, అక్కడ ఉన్న వసతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ముందుగా అమృత్ సంఘాలను గుర్తిస్తారు. సంబంధిత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్(ఎస్‌హెచ్‌జీ) యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాల్సి ఉంటుంది. ఎటువంటి క్రిమినల్, యాంటి సోషల్ ట్రాక్ రికార్డును కలిగిఉండకూడదు. టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు విభాగాల్లో పరిజ్ఞానం ఉన్నవారిని గుర్తించి అమృత్ మిత్రలను ఎంపిక చేస్తారు. కనీసం ఎనిమిదో తరగతి వరకు అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
మహిళల భాగస్వామ్యం పెంచేందుకు...
- దుర్గపు శ్రీనివాస్‌గౌడ్, మెప్మా జిల్లా పరిపాలన అధికారి, జగిత్యాల
ఇప్పటి వరకు కార్పొరేషన్లలో ఉన్న అమృత్ మిత్రల నియామకం ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా అమలు చేయాలని కేంద్రప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో సంఘాలు, సభ్యులను గుర్తిస్తాం. పట్టణాల అభివృద్ధి లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు అమృత్ మిత్రలు పనిచేస్తారు. తాగునీరు, పారిశుధ్యం, సుందరీకరణలో పట్టణ ప్రజలు మరింత చైతన్యం అవుతారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు అందాయి.
Updated Date - May 03 , 2025 | 12:37 AM