జూనియర్ కళాశాలలకు మహర్దశ
ABN, Publish Date - Jul 02 , 2025 | 01:23 AM
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రభుత్వం నిధులు కేటాయించింది.
జగిత్యాల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లాలో 11 జూనియర్ కళాశాలలకు రూ.1.08 కోట్లు మంజూరయ్యాయి. దశాబ్దకాలం తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంజూరైన నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు చేయించనున్నారు. నెల రోజుల్లోపు పనులు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ఫమెరుగుకానున్న మౌలిక వసతులు
పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు రాకపోవడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సరైన వసతులు లేక విద్యార్థులు, అధ్యాపకులు నానా అవస్థలు పడ్డారు. దాదాపు దశాబ్దం తర్వాత ఇంటర్ విద్యాశాఖ నిధులు మంజూరు చేసింది. మూడు నెలల కిందట ప్రతిపాదనలు పంపించగా ఆమోదం లభించింది. పది సంవత్సరాల క్రితం వరకు ఎన్‌ఆర్‌డీపీ కింద యేటా నిధులు మంజూరు జరిగేది. ఆ తరువాత నిధులు విడుదల కాలేదు. పలు చోట్ల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సొంతంగా కొన్ని రకాల పనులకు సొమ్ము వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. తరగతి గదుల మరమ్మతుకు అవకాశం లభించింది. ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, భవనాల మరమ్మతులతో పాటు విద్యార్థులకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, భవనాలకు రంగులు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు, నీటి సరఫరా, ప్లంబింగ్ వంటి పనులు చేపట్టనున్నారు.
ఫప్రవేశాలు పెరిగేందుకు ఉపయోగం..
కళాశాలలకు మంజూరు అయిన నిధులతో మరమ్మతులు చేపట్టనున్నారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, ఫర్నీచర్, బోరు బావి ఇతరత్రా సదుపాయాలు కల్పించనున్నారు. మూడు సంవత్సరాల క్రితం కళాశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా బిల్లులు విడుదల కాకపోవడంతో పలు చోట్ల అసంపూర్తిగా మారాయి. వీటిని పూర్తి చేయాల్సి ఉంది. పలు కళాశాలల్లో సీసీ కెమెరాల బిగింపు కొనసాగుతోంది. వేసవి సెలవుల్లో అగ్నిమాపక వ్యవస్థను అమర్చారు. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనతో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు.
ఫనిర్వహణ నిధుల కోసం ఎదురుచూపులు
ప్రభుత్వం జూనియర్ కళాశాలల మరమ్మతులకు నిధులిచ్చినా నిర్వహణ నిధులు మంజూరు చేయలేదు. చాక్‌పీస్‌లు, స్టేషనరీ, రిజిస్టర్లు, జెండా వేడుకలు, ఇతర సమావేశాల ఖర్చులు, పారిశుద్య నిర్వహణ, హాల్‌టికెట్ల డౌన్ లోడ్ తదితర అవసరాలకు ఒక్కో కళాశాలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వ్యయం అవుతోంది. దీంతో నిర్వహణ నిధులు అందించాలని అధ్యాపకులు కోరుతున్నారు.
సమస్యలు తీరుతాయి..
-బొప్పరాతి నారాయణ, జిల్లా ఇంటర్ విద్యాధికారి
ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు దృష్టి సారించాం. చాలా సంవత్సరాల తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం లభించింది. ఆయా కళాశాలలు నిధులను సద్వినియోగం చేసుకోవాలి.
---------------------------------------------------------------------
కళాశాల - కేటాయించిన నిధులు (రూపాయల్లో)
---------------------------------------------------------------------
సారంగపూర్ - 5.70 లక్షలు
మెట్‌పల్లి - 12.50 లక్షలు
ఇబ్రహీంపట్నం- 5.10 లక్షలు
ధర్మపురి - 8.10 లక్షలు
బీర్‌పూర్ - 6.93 లక్షలు
మల్లాపూర్ - 3.80 లక్షలు
రాయికల్ - 16.95 లక్షలు
మల్యాల - 16.00 లక్షలు
కోరుట్ల (బాలురు) - 7.15 లక్షలు
కోరుట్ల (బాలికలు) - 12 లక్షలు
కొడిమ్యాల - 14.10 లక్షలు
---------------------------------------------------------------------
మొత్తం - రూ.1.08 కోట్లు
---------------------------------------------------------------------
Updated Date - Jul 02 , 2025 | 01:23 AM