ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేస్తాం

ABN, Publish Date - May 30 , 2025 | 01:06 AM

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తామంతా కలిసి పనిచేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కరీంనగర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తామంతా కలిసి పనిచేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలలో నీరు నిలిపే పరిస్థితులు లేకున్నా ఉమ్మడి జిల్లా పరిధిలోనే కాకుండా రాష్ట్రంలో కూడా గణనీయమైన వరి ఉత్పత్తి సాధించామని ఆయన చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఈ రబీ సీజన్‌లో 13.55 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2782 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి రాష్ట్రంలో 285 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండించామని, దేశంలోనే తెలంగాణ వరి ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి అన్నారు. యాసంగి సీజన్‌లో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించామని, మే 28 నాటికి 67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 12,922 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రాజెక్టుల్లో నీటి నిల్వను పెంచుతాం..

వానాకాలంలో ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో ప్రణాళిక సిద్ధం చేయడంలో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఇసుక మేటల కారణంగా ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, ఆధునిక పద్ధతుల్లో వాటిని తొలగించి నీటి నిల్వను పెంచుతామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాలువలు, తూములు, ఓటీల మరమ్మతు పనులను త్వరలోనే పూర్తి చేయాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామనిన్నారు. రాళ్లవాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజుల్లో ప్రారంభిస్తామని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు. యాసంగిలో పండించిన సన్నరకాల వడ్లను మిల్లింగ్‌ చేస్తే విరిగే అవకాశాలున్నందున బాయిల్డ్‌ రైస్‌గా మార్చేందుకు అనుమతివ్వాలని రైస్‌ మిల్లర్లు కోరుతున్నారని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తుందని మంత్రి చెప్పారు. నీటి పారుదల శాఖ పరిధిలో 1,100 మంది ఇంజనీర్లను, 1,800 మంది లష్కర్లను నియమించామని మంత్రి తెలిపారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు వచ్చేలా జగిత్యాల కలెక్టర్‌ ప్రయత్నించాలని, అందుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాలని మంత్రి ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను చేపట్టి పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రజాస్వామిక స్పూర్తితో భూభారతి

- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ప్రజాస్వామిక స్పూర్తితో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ప్రతి కమతానికి ప్రత్యేక నంబర్‌తో భూధార్‌ కార్డులను అందజేస్తామన్నారు. భూధార్‌కార్డులో భూమి హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబరు పట్టాలు ఉంటాయన్నారు. రెవెన్యూ యంత్రాంగం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారుల మీద నమ్మకం పెట్టుకొని ఈ పథకాన్ని రూపొందించామన్నారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి 90 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారని అభినందించారు. రైతు సమస్యలపై కలెక్టర్లు వారి పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లదే తుది నిర్ణయమని తెలిపారు. అకాలవర్షం కారణంగా పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు పరిహారం కింద 51 కోట్లు విడుదల చేశామన్నారు. ఉమ్మడి జిల్లా మగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నిరంతరం జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

గతంలో రైతులు ఇబ్బందులకు గురయ్యారు..

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

గత పాలకుల హయాంలో రైస్‌ మిల్లుల వద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులు గురయ్యారని, ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఇబ్బంది రాలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మలక్‌ పేట, సూరమ్మ, మోతే నారాయణ పూర్‌, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టు పనులు వేగవంతం పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదని అన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, ప్రభుత్వ సలహాదారు హర్కార్‌ వేణుగోపాల్‌, నాలుగు జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరు...

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు. ఇద్దరు ఎంపీలు గైర్హాజరయ్యారు. కరీంనగర్‌ ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ గైర్హాజరయ్యారు.

ధాన్యంలో కోత విధిస్తే చర్యలు

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కరీంనగర్‌ అర్బన్‌: రైస్‌ మిల్లుల వద్ద ఎక్కడైనా ధాన్యంలో కోత విధిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు భూ సేకరణ నిధులు వస్తే కుడి ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. వరద కాలువపై 15 కోట్లతో క్రాస్‌ రెగ్యులేటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలో పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ డీ 83 కాలువలు పూర్తి స్థాయిలో నీరు రావడంతో రామగుండం ప్రాంతంలో 40 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా పంట దిగుబడి వచ్చిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సింగరేణికి సంబంధించిన భూములు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బండల వాగు ఎత్తిపోతల పథకం పూర్తయిందని, దీనిని అధికారికంగా ప్రారంభించాలన్నారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేసి పూర్తి చేయాలని, పత్తిపాక రిజర్వాయర్‌ పనులు ప్రారంభించాలని కోరారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పాలనలో ఎక్కడా కూడా కట్టింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఐదు రోజుల్లో పూర్తవుతాయన్నారు. డీ83, డీ86, డీ89, డీ91 కాల్వలకు సాగు నీటి ఇబ్బంది తీరాలంటే పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణం జరగాలని అన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ జిల్లా పరిధిలోని కాలువలు, షట్టర్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. డిజైన్‌ సమస్య వల్ల దెబ్బతిన్న చెక్‌ డ్యాంలకు మరమ్మతులు చేయాలని కోరారు.

చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డు వంటి పథకాలు అర్హులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ పనులు 90 శాతం పూరయ్యాయని, భూ సేకరణ కోసం 23 కోట్లు, ప్రాజెక్టు పనులకు 20 కోట్లు విడుదల చేయాలని కోరారు. కొండగట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు 22 కోట్ల విడుదల చేయాలన్నారు.

కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఈ సీజన్లో 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మూడు లక్షల 3500 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి విడతలో 2,027 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 990 మార్కింగ్‌ చేశామని తెలిపారు. 380 గ్రౌండింగ్‌ పూర్తి చేశామని, 346 ఇళ్లు పేమెంట్లు ఇచ్చామని తెలిపారు. జిల్లాలో యూరియా ఎరువులు విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.

జగిత్యాల కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ఉన్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు.

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ రబీ సీజన్‌లో 242 కోనుగోలు కేంద్రాల ప్రారంభించి 2.5 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఉన్న రవాణా సమస్య పరిష్కరించామన్నారు. మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లల పూర్తవుతాయని తెలిపారు. 7,800 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు.

Updated Date - May 30 , 2025 | 01:06 AM