పోయిన ఫోన్‌ను పట్టేద్దాం..
ABN, Publish Date - Jul 04 , 2025 | 01:23 AM
నేటి ఆధునిక యుగంలో సెల్‌ఫోన్ కీలకమైంది. 90 శాతం కొనుగోళ్లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి.
కరీంనగర్ క్రైం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నేటి ఆధునిక యుగంలో సెల్‌ఫోన్ కీలకమైంది. 90 శాతం కొనుగోళ్లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. అన్ని రకాల చెల్లింపులకు ఫోనే ఆధారంగా మారింది. ఫోన్ ఎక్కడైనా పోతే, ఎవరైనా దొంగిలిస్తే ఆ ఫోన్‌లో భద్రపరిచిన విలువైన వ్యక్తిగత సమాచారం, ఇతర డేటా కోసం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో సెల్‌ఫోన్ పోతే.. దాన్ని తిరిగి పొందేందుకు పోలీసులకు, మీసేవలో దరఖాస్తు చేసేందుకు ఇబ్బందులు పడుతుండేవారు. అయినప్పటికీ ఆ ఫోన్ లభిస్తుందో లేదో గ్యారంటీ లేకపోయేది. 2023 ఏప్రిల్ నుంచి కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఈఐఆర్ ప్రత్యేక అప్లికేషన్ ద్వారా సెల్‌ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్ ద్వారా కరీంనగర్ కమిషనరేట్‌లో ఇప్పటి వరకు వెయ్యి వరకు సెల్‌ఫోన్‌లను పోలీసులు వెతికిపట్టుకుని యజమానులకు అప్పగించారు. పోగొట్టుకున్న, చోరీ అయిన వేల సెల్‌ఫోన్లను ఈ పోర్టల్ ద్వారా పోలీసులు బ్లాక్ చేశారు.
ఫోన్ బ్లాక్
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా పోయిన ఫోన్‌ను ఐఎంఈఐ నంబర్ సాయంతో బ్లాక్ చేయవచ్చు. ఆ తరువాత నుంచి ఆ సెల్‌ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఫోన్ ఆన్‌చేసి అందులో సిమ్ తీసి కొత్త సిమ్ వేసినా ఆ విషయం ఫోన్ యజమానికి, పోలీసులకు వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది.
ఎలా పని చేస్తుంది..?
సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. అందులో బ్లాక్ ఫోన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మొబైల్ నంబర్-1, మొబైల్ నంబర్-2 ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్వాయిస్(బిల్)ఫొటో సూచించిన గడుల్లో సమాచారాన్ని పూర్తిగా నింపాలి. పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామాలు, అంతకుముందే ఇచ్చిన పోలీస్ ఫిర్యాదు నంబర్, ఫోన్ యజమాని చిరునామా, ఈ మెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చాప్టర్లను సూచించిన బాక్సుల్లో పూరించాలి. వెంటనే సెల్‌ఫోన్ పాత నంబర్‌పై తీసుకున్న కొత్త సిమ్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్ చేయలేరు. డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ ఫోన్ దొంగిలించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్‌లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే మీ నంబర్‌కు రిక్వెస్ట్ ఐడీ మెసేజ్ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నా పట్టుకోవడం సులభతరం అవుతుంది.
అన్‌బ్లాక్ చేసే విధానం..
పోయిన సెల్‌ఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా.. లేక దొరికినా.. పాత ఐడీ, ఫోన్ నంబర్, ఇతర వివరాలు నింపిన తర్వాత ఫోన్‌నుఅన్‌బ్లాక్ చేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నప్పుడు అది దొంగిలించిందా లేదా బ్లాక్‌లిస్టులో ఉందా? అనే విషయం మనం కేవైఎం (నో యువర్ మొబైల్) విధానంలో ముందే తెలుసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ తీసుకుని కేవైఎం విధానంలోనూ ఐఎంఈఐ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అందుకోసం కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్ చేయాలి. అనంతరం 15 అక్షరాల ఐఏంఈఐ నంబర్‌ను టైప్ చేసి 14422 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. ఇందుకోసం కేవైఎం యాప్‌ను సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. సీఈఐఆర్ వెబ్‌సైట్‌లోనూ ఆఖరిగా ఇచ్చిన ఆప్షన్ ద్వారా కూడా ఫోన్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
ఐఎంఈఐ నంబర్ తెలియకపోతే..
పోగొట్టుకున్న ఐఎంఈఐ నంబర్ తెలియకపోయినా, గుర్తు లేకపోయినా దాన్ని తెలుసుకోవచ్చు. మొబైల్ నుంచి ూు06ు డయల్ చేయగానే మీ మొబైల్ నంబర్‌పై దాని ఐఎంఈఐ నంబర్ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే ఫోన్ కొనుగోలు చేసిన బాక్స్‌పై లేదా కొనుగోలు చేసిన షాపులో ఉన్న ఇన్‌వాయిస్ బిల్లు ద్వారా కూడా ఐఎంఈఐ నంబర్‌ను పొందవచ్చు.
స్టేషన్ల వారీగా గుర్తించిన ఫోన్లు
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రజలు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన 1,627 సెల్‌ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. పోలీసు ఠాణాలవారీగా సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. కరీంనగర్ రూరల్- 275, కరీంనగర్ సీసీఎస్-37, కరీంనగర్ వన్‌టౌన్-373, కరీంనగర్ టూటౌన్-234, కరీంనగర్ త్రీటౌన్-105, హుజురాబాద్ టౌన్-75, చిగురుమామిడి-17, శంకరపట్నం-47, చొప్పదండి-39, ఇల్లందకుంట-23, గంగాధర-26, సైదాపూర్-24, గన్నేరువరం-21, జమ్మికుంట-73, కొత్తపల్లి-56, ఎల్‌ఎండీ కాలనీ-64, మానకొండూర్-87, రామడుగు-10, వీణవంక పోలీస్ స్టేషన్‌లో 41 సెల్‌ఫోన్‌లు వెదికిపట్టుకుని ఫిర్యాదుదారులకు అప్పగించారు.
Updated Date - Jul 04 , 2025 | 01:23 AM