ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:57 AM
జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ అధికారులు, భూసేకరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడారు. జిల్లాలో వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ మరియు పునరావాసం పనులను వేగంగా పూర్తిచేయాలని సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూసేకరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన పెండింగ్ పనులతో పాటు ఇతర ప్రాజెక్టుల కింద ఉన్న మిగిలిన భూసేకరణ పనులపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురవక ముందే అన్ని కాలువల మరమ్మతు పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఇరిగేషన్ అధికారి రమేష్, పలువురు ఈఈలు, డీఈలు, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
ధర్మపురి (ఆంధ్రజ్యోతి): సామాజిక ఆరోగ్య కేంద్రం, మాత శిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ధర్మపురి మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని 50 పడకల గదులను 100 పడకల గదులుగా మార్చిన భవనం నిర్మాణ పనులను, పూర్తికాని పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని అన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మాతా శిశువు ఆరోగ్య కేంద్రం నూతన ఏర్పాటు చేసిన 50 పడకల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పూర్తికాని పనులు ఉన్నట్లయితే వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. కాంపౌండ్ వాల్, విద్యుత్తు ప్లంబింగ్ లాంటివి పనులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ సత్య ప్రసాద్ వెంట ధర్మపురి ఇంచార్జీ తహసిల్దార్ సుమన్, ఎంపీడీవో రవీందర్, ఆర్‌ఎంఓ రామకృష్ణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:57 AM