ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ వైద్య కళాశాలకు నిధుల కొరత

ABN, Publish Date - May 22 , 2025 | 01:54 AM

జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆగస్టులో ఎంబీబీఎస్‌ మరో బ్యాచ్‌కు భవనాలు అవసరం కానున్నాయి. నిధులు లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయినట్లు వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2022 డిసెంబరు 7వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్‌ భూమి పూజచేసి పనులు ప్రారంభించారు.

-అర్ధాంతరంగా ఆగిన భవన నిర్మాణం

-బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

-తాత్కాలిక షెడ్లలో తరగతులు

-అద్దె భవనంలో హాస్టల్‌

-విద్యార్థులకు తప్పని ఎదురుచూపులు

జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆగస్టులో ఎంబీబీఎస్‌ మరో బ్యాచ్‌కు భవనాలు అవసరం కానున్నాయి. నిధులు లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయినట్లు వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2022 డిసెంబరు 7వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్‌ భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. మెడికల్‌ కళాశాల, బాలికలు, బాలుర వసతి గృహాలతో పాటు అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణానికి జిల్లా కేంద్రంలోని దరూర్‌ క్యాంపులో 8.6 ఎకరాలలో పనులు చేపట్టారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, పర్యవేక్షకుల గదులు, అంతర్గత రహదారులు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ తదితర పనులకు ఆయా నిధులు వెచ్చించాల్సి ఉంది. మూడు దశల్లో పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు. మొదటి దశగా రూ.14 కోట్లు వెచ్చించి కళాశాల తరగతుల నిర్వహణ, తాత్కాలిక భవనాల ఏర్పాటు, ఇతర భవనాల అభివృద్ధి తదితర పనులను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లించింది. రెండో దశలో భాగంగా రూ.115 కోట్ల నిధులతో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం, బాలుర, బాలికల వసతి గృహాలు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వం మారడం, నిధుల కేటాయింపులు లేకపోవడం వల్ల పనులపై తీవ్ర ప్రభావం చూపింది. కళాశాల ప్రధాన భవనాల పనులు తుది దశకు చేరాయి. ఇప్పటివరకు రూ.60 కోట్లకు సంబంధించిన పనులు పూర్తి చేశారు.

ఫరూ.49.8 కోట్ల బిల్లులు పెండింగ్‌

మెడికల్‌ కళాశాల నిర్మాణానికి సంబంధించి రూ.49.80 కోట్ల పనులు బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్‌ ఆరు నెలలుగా పనులు చేయడం నిలిపివేశారు. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల భవనానికి సంబంధించిన స్లాబ్‌లు, బ్రిక్స్‌ వర్క్స్‌ పూర్తయ్యాయి. బాలుర, బాలికల వసతి గృహాలకు సంబంధించిన స్లాబ్‌ నిర్మాణాలు జరిగినప్పటికీ బ్రిక్స్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రెండో దశ పనులు పూర్తయితే మూడో దశలో మెడికల్‌ కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ నిర్మాణం, ల్యాబ్స్‌ నిర్మాణం, ప్రిన్సిపాల్‌, ఆయా డిపార్ట్‌మెంట్‌ హెడ్స్‌కు క్వార్టర్స్‌ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను సుమారు రూ.60 కోట్లతో జరపాలన్న అంచనా ఉంది. అయితే రెండో దశలో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆరు నెలలుగా పనులు ముందుకు జరగడం లేదు. 18 నెలల్లో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా విధించారు. ఆ దిశగా పనులు కొనసాగకపోవడంతో 2024 డిసెంబరు 31వ తేదీ వరకు గడువును పొడిగించారు. నిధుల కొరతతో గత యేడాది డిసెంబరు నెలాఖరు వరకు పనులు పూర్తి కాలేదు. దీంతో మూడోమారు పనుల గడువును పొడగించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. సంబంధిత ప్రతిపాదనలు పంపి ఆరు నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. ఒక వైపు నిధులు మంజూరు కొరకు, మరో పనులు పూర్తి చేయడానికి గడువును పొడగించడానికి అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫవైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్షించినా...

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంగా మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాల పనులపై సమీక్షించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఆది శ్రీనివాస్‌, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌లతో కలిసి మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు. మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ కాంట్రాక్టర్‌కు పెండింగ్‌లో సుమారు 49.80 కోట్ల బిల్లులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. అయినప్పటికీ పనులు ముందుకు కదలడం లేదు.

ఫఅద్దెలతో ఆర్థిక భారం..

జిల్లా కేంద్రంలో గల క్యాంపు ఆవరణలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి 2021 జూన్‌లో ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటికే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులు కొనసాగుతున్నాయి. ప్రతీ బ్యాచ్‌కి 150మంది చొప్పున విద్యార్థులున్నారు. ఈయేడాది మరో బ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈమేరకు వసతులు, సౌకర్యాలు లేకుండా పోయాయి. మెడికల్‌ కళాశాల తరగతులను తాత్కాలిక షెడ్లలో నిర్వహిస్తున్నారు. బాలికల వసతి గృహాన్ని నర్సింగ్‌ కళాశాల ఆవరణలో గల భవనంలో నిర్వహిస్తుండగా, బాలుర వసతి గృహాన్ని పట్టణంలోని ఓ అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

వేగవంతం చేసేలా చర్యలు

-నవీన్‌, డీఈ, ఆర్‌అండ్‌బీ, జగిత్యాల

ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల పనుల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిధుల కొరత పనులపై ప్రభావం చూపుతోంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లాం. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిదులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలను అందజేస్తున్నాం. బిల్లులు మంజూరైతే పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 22 , 2025 | 01:54 AM