karimnagar : సమగ్ర అభివద్ధికి సమన్వయంతో పనిచేయాలి
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:35 AM
కరీంనగర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
- ప్రజలకు మంచి పాలన అందించాలి
- జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలి...
- జూలై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలి
- జిల్లాలో ఆయిల్ పామ్ పంట విస్తరణకు చర్యలు
- ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందించాలి
- ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కరీంనగర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వ్యవసాయశాఖ, విద్యాశాఖ, హౌసింగ్, పంచాయతీరాజ్‌శాఖల పని తీరుపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదిన్నరగా గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరియా వాడాలని, అధికంగా వాడటం వల్ల భూ సారం తగ్గిపోతుందని తెలిపారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగుపై మరింత శ్రద్ద వహించాలని అన్నారు. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు మించి ఆయిల్ పామ్ విస్తరణ చేపట్టాలన్నారు. హార్టికల్చర్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖలోని ఏఈఓ, ఏఓలు కూడా లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలని మంత్రి ఆదేశించారు. నగరం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద ఎత్తున చేయాలనాద్నరు.
ఫ విద్యా శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
విద్యా శాఖపై కలెక్టర్‌లు శ్రద్ధ వహించాలని, పైవ్రేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు విద్య అందాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. విద్యార్థుల నమోదు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న ఫలితాలను ప్రజలకు వివరించాలని మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించాలని, వర్షాలు కురిసే లోపు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా సమీక్షలకు జిల్లా అధికారులు మాత్రమే రావాలని, క్షేత్రస్థాయి అధికారులను డిస్టర్బ్ చేయవద్దని సూచించారు. చిన్న జిల్లాలతో కలెక్టర్లు మరింత క్షేత్ర స్థాయిలో పనిచేసే అవకాశం లభించిందని, దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.
ఫ నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాబోయే మూడున్న సంవత్సరాల్లో నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీల ద్వారా స్కూట్రినీ చేయించి, అర్హులైనవారందరికీ మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరికంటే రెండింతల ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని, కూరగాయల సాగును విస్తరించాలన్నారు. కరీంనగర్‌లోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి అక్కడ పరిస్థితులపై నివేదిక అందించాలని ఆదేశించారు.
ఫ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా
- మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల వ్యవధిలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలో జమ చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు పూర్తిస్థాయిలో కాకపోయినా తమకు ఉన్న పొలంలో కొంతమేర ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఒక గుంట భూమి కూడా పడావు పడకుండా సాగు జరగాలని అన్నారు. బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని, పేదలకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణాలు అందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూస్తున్నామన్నారు.
ఫ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు ఇవ్వాలి
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. మొదటి ఏడాది 62 వేల కోట్ల రూపాయల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదని, ప్రతి మండలం వద్ద అవసరమైన స్టాక్ అందుబాటులో పెడుతున్నామని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు.
ఫ రోడ్ల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి..
- కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భారత దేశం అవసరాల కోసం పెద్ద ఎత్తున ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని, దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. వరి పంట సాగు చేయడం వల్ల సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆయిల్ పామ్‌తో ఎంత ఆదాయం వస్తుందో స్పష్టంగా తేడా తెలిసేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని, మూడు క్రాప్‌ల ద్వారా 16 టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. వరి, ఇతర పంటలకు ఆరు నెలల్లో వచ్చే ఆదాయం ఆయిల్‌పామ్ ద్వారా మూడు నెలల్లో వచ్చిందని తెలిపారు. ఆయిల్ పామ్ గెలల కట్టింగ్ కూలీలకు నైపుణ్యంపై శిక్షణ ఇవ్వాలని, ఆయిల్ పామ్ కంపెనీలను చిగురుమామిడిలో ఏర్పాటు చేయాలని కోరారు. కరీంనగర్‌లో 120 రోడ్ల పనులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పెండింగ్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ పని తీరు పర్యవేక్షించాలని అన్నారు.
ఫ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ... సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో అధిక మొత్తంలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఆయిల్ ఫామ్ పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు.
ఫ ఇందిరమ్మ ఇళ్లను త్వరగా మంజూరు చేయాలి
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను పేదలకు త్వరగా మంజూరు చేయాలన్నారు. మెట్‌పల్లి హై స్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కన ఉన్న జూనియర్ కళాశాల భవనం 80 శాతం పని పూర్తయిందని, దానిని వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులను ఆ భవనానికి తరలించాలని కోరారు.
ఫ పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావ
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిందని, వరి సాగు విపరీతంగా పెరిగిందన్నారు. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేయాలని, వివిధ రకాల పంటల సాగు, భూ సారం పెంచడం, తప్పుడు పద్దతుల వల్ల కలిగే నష్టాల అవగాహన కల్పించాలన్నారు.
ఫ ఇళ్ల పట్టాల పంపిణీపై సమావేశం నిర్వహించాలి
- రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం వల్ల అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని అన్నారు. సింగరేణి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డీఎంఎఫ్‌టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు. సింగరేణి, ఎన్‌టీపీసీ యాజమాన్యాల ద్వారా రామగుండం, మంథని ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు మౌలిక వసతులు కల్పించాలని, అదనపు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
ఫ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
- మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... పాఠశాలలోని విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యలో బడి మానేసిన పిల్లలకు దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 శాతం ఎన్‌రోల్ చేయటం సంతోషమని, నమ్మి పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు చదువు బాగా చెప్పాలన్నారు.
ఫ చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ... నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూ సేకరణ పెండింగ్‌లో ఉందని, 43 కోట్లు విడుదల చేస్తే రిజర్వాయర్ పూర్తయి చొప్పదండి, వేములవాడ ప్రాంతానికి ఉపయోగపడుతుందన్నారు. చొప్పదండి ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతనంగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్ పబ్లిక్ రిలేషన్స్) హర్కర వేణుగోపాల్, కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్‌ఝ, సత్యప్రసాద్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరెందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 23 , 2025 | 12:35 AM