karimnagar : కానిస్టేబుళ్ల బదిలీలకు రంగం సిద్ధం
ABN, Publish Date - May 26 , 2025 | 12:51 AM
కరీంనగర్ క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుళ్ల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది.
- మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన 69 మందికి స్థానచలనం?
- స్వంత మండలం మినహా 5 ఆప్షన్స్‌తో బదిలీలు
- ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
కరీంనగర్ క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుళ్ల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. కమిషనరేట్‌లో వివిధ పోలీసు ఠాణాలు, సీఐ, ఏసీపీ కార్యాలయాలతో పాటు స్పెషల్ బ్రాంచి, టాస్క్‌ఫోర్స్ వంటి విభాగాల్లో విధులు నిర్వహి స్తున్న సివిల్ కానిస్టేబుళ్ల బదిలీలకు కసరత్తులు నడుస్తున్నాయి. ఒకే పోలీసు ఠాణాలో 3 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన కానిస్టేబుళ్లు బదిలీలకు అర్హులుగా పేర్కొంటూ, వీరికి కౌన్పెలింగ్ ద్వారా బదిలీలు చేసేందుకు పోలీస్‌కమిషనర్ గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు మరో ఠాణాకు బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన కానిస్టేబుళ్లు కమిషనరేట్ వ్యాప్తంగా 69 మంది ఉన్నట్లు గుర్తిం చారు. ఈ 69 మంది కానిస్టేబుళ్లు ఐదు పోలీసు టాణాలను ఎంపిక చేసుకుని సీపీఓలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో కానిస్టేబుల్‌కు ఐదు పోలీసు ఠాణాలను కోరుకునేందుకు (ఆప్షన్) అవకాశం కల్పించారు. ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసుకుని దరఖాస్తులను సీపీ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అయితే కానిస్టేబుళ్లు వారి స్వంత మండలం కాకుండా ఇతర పోలీసు ఠాణాలను మాత్రమే బదిలీలకు ఎంపిక చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30న చివరి గడువుగా విధించారు. గడువులోగా 69 మంది కానిస్టేబుళ్లు దర ఖాస్తు చేసుకున్న అనంతరం జూన్ నెలలో వీరందరికీ బదిలీలు చేయనున్నారు. వేసవి సెలవులు పూర్తయ్యేలోగా బదిలీలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా బదిలీ అయిన కానిస్టేబుళ్ల పిల్లలు స్థానికంగా పాఠశాలల్లో, కళాశాలల్లో చేరేందుకు సమస్య రాకుండా వారు బదిలీ అయిన చోటనే పిల్లల చదువులు నడిచే విధంగా జూన్ 2వ వారంలోగా బదిలీలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
ఫ గతంలో కానిస్టేబుళ్ల బదిలీలకు 5 సంవత్సరాల సర్వీసు ఉండేది. మూడేళ్ల క్రితం నుంచి మూడేళ్ల సర్వీసు విధానాన్ని అవలంభిస్తున్నారు. గతంలోని మాదిరిగానే 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసినవారికే బదిలీలుంటే బాగుండునని పట్టణాలలో పనిచేస్తున్న సిబ్బంది కోరుకుంటుండగా, మారుమూల మండలాలలో పనిచేసేవారు మాత్రం మూడేళ్ల సర్వీసునే కొనసాగించాలని కోరుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతులు రానుం డటంతో అప్పుడు కానిస్టేబుల్ ఖాళీ అయ్యే అవకాశముంది. మళ్లీ మరికొందరికి బదిలీ అవకాశముంటుందని చెబుతున్నారు. హోంగార్డుల బదిలీలు కూడా త్వరలో చేపట్టే అవకాశముంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నేపథ్యంలో హోంగార్డులు కొందరు అక్కడ విధుల్లో ఉండటం కారణంగా బదిలీలు జరగలేదని సమచారం. పుష్కరాలు పూర్తి అయిన వెంటనే హోంగార్డుల బదిలీలను కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్‌కమిషనర్ కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. ఎస్సై బదిలీలు కూడా జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవలనే కమిషనరేట్‌లో 9 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం వీరందరూ పాత పోస్టింగ్‌ల్లోనే ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. పదోన్నతులు పొందినవారితో పాటు మరి కొందరు ఎస్సైలకు బదిలీలు జరిగే అవకాశముంది.
Updated Date - May 26 , 2025 | 12:51 AM