Karimnagar: ఐదు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు
ABN, Publish Date - May 30 , 2025 | 12:00 AM
సుభాష్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్దారణ చట్టాన్ని అతిక్రమించిన ఐదు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ
సుభాష్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్దారణ చట్టాన్ని అతిక్రమించిన ఐదు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్దారణ నిషేదిత చట్టం జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ నిషేధ చట్టం ప్రకారం స్కానింగ్ సెంటర్లలో గర్భంలో ఉన్న పిండం ఆడ లేదా మగ శిశువు అని గర్భిణికి, కుటుంబ సభ్యులకు తెలియజేయడం నేరమన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేసిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తారని తెలిపారు. సహకరించిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఐదు వేల జరిమానా విధిస్తారన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని రాసి ఉన్న బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పీవోడీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీపీసీ, పీఎన్‌డీటీ డాక్టర్ సనాజవేరియా, డెమా రాజగోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ కైక, సూపర్‌వైజర్ సయీద్ సాబీర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్ పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 12:00 AM