Karimnagar: వివరాలు ఆన్‌లైన్ చేసేదెలా?
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:27 AM
కరీంనగర్ రూరల్, జూన్ 19 (ఆంధ్ర జ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో సిబ్బందికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ అందజేసింది.
- అంగన్‌వాడీల్లో పాత సెల్‌ఫోన్లతో సమస్యలు
కరీంనగర్ రూరల్, జూన్ 19 (ఆంధ్ర జ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో సిబ్బందికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ అందజేసింది. కేంద్రల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్బిణులకు అందుతున్న సేవలను అంగన్‌వాడీ టీచర్లు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్లలో ఎక్కువగా స్టోరేజీ లేక పోవడంతోపాటు పాతవి కావడంతో వివరాల నమోదుకు అంగన్‌వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ ట్రాకర్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో చిన్నారుల హాజరు, బరువు, ఎత్తు, బాలింతలు, పిల్లల నమోదు, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల అటెండెన్స్ ముఖ చిత్రం ద్వారా వేయాల్సి ఉంటుంది. కరీంనగర్ రూరల్ మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలు 19 ఉన్నాయి. గర్భిణులు 110 మంది , బాలింతలు 91 మంది ఉండగా 0-6నెలల వయస్సు గల పిల్లలు 91 మంది ఉన్నారు. అలాగే 6నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 595 మంది ఉండగా మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 91 మంది ఉన్నారు. వీరి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కేంద్రాల్లో సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందకు ముఖ చిత్ర నమోదుకు శ్రీకారం చుట్టారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేస్ రీడింగ్ తీసుకుని సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్లు సరిగా పని చేయకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:27 AM