Karimnagar: ఫీజులు ఇవ్వకపోతే చదవులు ఎలా..?
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:48 AM
సుభాష్‌నగర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకారవేతనాలు విడుదల చేయకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రశ్నించారు.
- శాతవాహనలో ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేయాలి
- ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి
సుభాష్‌నగర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకారవేతనాలు విడుదల చేయకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆద్వర్యంలో హలో విద్యార్థి...చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన వచ్చిన తరువాత విద్యారంగంలో వచ్చిన మార్పు ఏదిలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ ఆస్థవ్యస్థమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు నాన్ ప్రొఫెషనల్‌కు సంబందించి రెండు వేల కోట్లు, ప్రొఫెషనల్‌కు సంబందించినవి నాలుగు వేల కోట్ల స్కాలర్‌షిప్ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఆర్టీసీలో ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని, శాతవాహన యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, అవసరమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, వెంకటేష్, మచ్చ రమేశ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పటికి జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్ళకు స్వంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. వెంటనే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్, కేశబోయిన రాము, కనకం సాగర్, లద్దునూరి విష్ణు, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్‌రెడ్డి, బొల్లి సాయికృష్ణ, బోయిన విష్ణు, శ్రావణ్, అశోక్, అజయ్ పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:48 AM