karimnagar : నిండు ప్రాణానికి రక్షణ ‘హెల్మెట్’
ABN, Publish Date - May 11 , 2025 | 12:26 AM
కరీంనగర్ క్రైం, మే 10 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం... రోడ్లపై అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం... మద్యం మత్తులో... సెల్‌ఫోన్ డ్రైవింగ్.. ట్రిపుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్, అతివేగంగా వాహనాలు నడపటం, విన్యాసాలు చేయడం... కారణాలేమైనప్పటికీ బలయ్యేది అమాయకప్రాణాలే...
- ప్రమాదాల్లో 50 శాతం ద్విచక్రవాహనదారులవే...
- తలకుతీవ్ర గాయాలతోనే 90 శాతం మరణాలు
- అవగాహనతోనే... ప్రమాదాల నివారణ
కరీంనగర్ క్రైం, మే 10 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం... రోడ్లపై అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం... మద్యం మత్తులో... సెల్‌ఫోన్ డ్రైవింగ్.. ట్రిపుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్, అతివేగంగా వాహనాలు నడపటం, విన్యాసాలు చేయడం... కారణాలేమైనప్పటికీ బలయ్యేది అమాయకప్రాణాలే... ఇంటి నుంచి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారా? అని ఎదురుచూసే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనేది ఒకప్పటి మాట... లాభం మాట దేవుడెరుగు... క్షేమంగా ఇంటికి చేరితే అదే పదివేలు అని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి... నిండుప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి... రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో తలకు గాయాల కారణంగా మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. హెల్మెట్ వాడకపోవటం వల్లనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. హెల్మెట్‌వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసు, రవాణాశాఖపై ఉన్నది.
ఫ ఉపయోగాలు
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడకంతో ప్రమాదాల సమయంలో తలకు రక్షణ కవచంగా నిలుస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగి బైక్ నుంచి కిందపడిన సందర్భంలో తలకు గాయాలుకాకుండా హెల్మెట్ కాపాడుతుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో వాహనదారుడు హెల్మెట్ ధరించడం వల్ల దుమ్ము, ధూళి, ఎండ నుంచి హెల్మెట్ రక్షణగా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాహనదారులను హెల్మెట్ క్షేమంగా ఇంటికి చేర్చుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా బైక్‌పై వెళుతున్న వారికి హెల్మెట్ ధరించాలని తప్పకుండా సూచించాలి. హెల్మెట్ ధరించకుంటే పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానా విధించే అవకాశమున్నది. వేగంకన్నా క్షేమంగా ప్రయాణమే ముఖ్యమనేది ప్రతి ఒక్క వాహనదారుడు గుర్తుంచుకోవాలి.
ఫ నిబంధనలకు విరుద్ధంగా..
మైనర్ బాలురు, యువకులు డ్రైవింగ్ మీద అవగాహన లేకుండానే హెల్మెట్ ధరించకుండా మితిమీరిన వేగంతో వాహనాలను నడపడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. యువత ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో హెల్మెట్‌ను గుదిబండగా చూస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్‌పై రయ్..రయ్..మంటూ దూసుకుపోవటం ఫాషన్‌గా మరింది. ఇదే ప్రాణాలమీదికి కొనితెచ్చుకుంటున్నారు. కరీంనగర్‌లో 10 నుంచి 20 సంవత్సరాల్లోపు యువకులు ఎక్కువగా రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో దాదాపు 100 మంది మైనర్లు రాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కగా వారి కుటుంబ సభ్యులను ఠాణాలకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లు, లైసెన్స్‌లేని వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదుచేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫ రెండేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో 387 మంది మృతి
పోలీసు కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండేళ్ళలో 387 మంది మృత్యువాతపడ్డారు. మరో 1,200 మంది వరకు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 50 శాతం ద్విచక్రవాహనదారుల ప్రమాదాలే ఉన్నాయి. అతివేగంగా వాహనాలు నడపడంతో అదుపుతప్పి కిందపడటం, ఎదురుగా వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలతో ఆందోళన కలిగిస్తున్నది. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలతోనే 90 శాతం మంది మరణిస్తున్నారు. తలకు హెల్మెట్ ధరించిన సమయంలో ప్రమాదం జరిగితే చేతులు, కాళ్లు, ఇతర భాగాల్లో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశమున్నది. సున్నితమైన తలకు గాయాలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాలు జరగగా 203 మంది మృత్యువాత పడ్డారు. మరో 600కు పైగా గాయపడ్డారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 184 మంది మృత్యువాత పడ్డారు. మరో 600 వరకు గాయపడ్డారు.
ఫ అవగాహన కల్పిస్తే.....
ప్రతి ద్విచక్రవాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినా ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. పోలీసు కమిషనరేట్‌లో కొంతకాలం వరకు హెల్మెట్‌ధారణ తప్పనిసరి చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. ఇటీవలి కాలంలో ఈ హెల్మెట్ నిబంధనపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే స్వచ్ఛందంగా హెల్మెట్ దరించడం అలవాటవుతుంది. పోలీసుల తనిఖీల కోసం కాకుండా ద్విచక్రవాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్లను కొనుగోలు చేసి ధరిస్తేనే ఫలితంగా ఉంటుంది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్లను ధరిస్తే ప్రమాదాల సమయంలో రక్షణ ఉంటుందని పోలీసులు, నిపుణులు చెబుతున్నారు.
Updated Date - May 11 , 2025 | 12:26 AM