అప్రమత్తంగా ఉంటే చాలు..
ABN, Publish Date - May 29 , 2025 | 12:22 AM
కరోనా మరోసారి కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హైరానా పడుతున్నారు. దేశంలో కొవిడ్, ఆ తరువాత ఒమైక్రాన్, ఇలా ఏ వేరియంట్ వచ్చినా జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం వస్త్రోత్పత్తి రంగంలో ఉండగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది.
- మళ్లీ కరోనా కలవరం
- కొత్త వేరియంట్‌తో ముప్పు లేదంటున్న వైద్యులు
- కొవిడ్, సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం అలర్ట్
- గతంలో తీసుకున్న వ్యాక్సిన్‌తో పెరిగిన వ్యాధి నిరోధకత
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కరోనా మరోసారి కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హైరానా పడుతున్నారు. దేశంలో కొవిడ్, ఆ తరువాత ఒమైక్రాన్, ఇలా ఏ వేరియంట్ వచ్చినా జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం వస్త్రోత్పత్తి రంగంలో ఉండగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. ఈక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. మరోవైపు ఉపాధి నిమిత్తిం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్న కార్మికులతో పాటు ఇతర దేశాల్లోనూ ఉద్యోగం, చదువు రీత్యా వెళ్లిన వారు ఎక్కువగానే ఉన్నారు. రాకపోకలతో వైరస్ వ్యాప్తి జిల్లాలో ముందుగానే వెలుగుచూస్తోంది. గతంలో కొవిడ్ తరువాత వచ్చి ఒమైక్రాన్ కూడా రాష్ట్రంలో సిరిసిల్లలోనే తొలి కేసులు గుర్తించారు. ఈక్రమంలో ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా మహమ్మారి మరోసారి బయటపడడంతో జిల్లా ప్రజల్లో అప్రమత్తత మొదలైంది. వైద్యులు, ఐసీఎంఆర్ మాత్రం ప్రస్తుతం వస్తున్న వేరియంట్‌తో పెద్దగా ముప్పులేదని సాధారణ అప్రమత్తతే సరిపోతుందని సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కొవిడ్‌తో పాటు వర్షాకాలం సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే దిశగా అలర్ట్ ప్రకటించింది. తీసుకోవాల్సిన సూచనలపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు కూడా జారీ చేశారు.
వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు...
కొవిడ్‌పై వస్తున్న వదంతులు వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు కరోనాపై మాట్లాడాలని, అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని ప్రభుత్వం సూచనలు చేసినట్లుగా తెలిసింది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గుకు ప్రజలు భయాందోళనలకు గురికావద్దని సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్ నిల్వలు, బెడ్స్, అవసరమైన మందులు, మాస్క్‌లు, ఆర్టీపీసీఆర్ పరీక్షల కిట్‌లు, ఇతర సామగ్రి అవసరాలపై ప్రభుత్వం నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కొత్త వేరియంట్‌తో ఇబ్బందులు లేకపోయినా గుండె, క్యాన్సర్, కాలేయం, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ బాధితులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
గతంలో జిల్లాలో 37,197 మంది బాధితులు...
కరోనా మహమ్మారి మొదటి రెండు దశల్లో చేసిన బీభత్సం ప్రజల నుంచి ఇప్పటికి తొలగిపోవడం లేదు. ఎంతో మంది ఆర్థికంగా చితికిపోగా, అనేక కుటుంబాల్లో మృత్యుఘోష వినిపించింది. మూడో దశలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే గడిచిపోయింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో రెండు దశల్లో జిల్లాలో 37,197 మంది కొవిడ్ బారిన పడ్డారు. 676 మంది మృతిచెందారు. జిల్లాలో కొవిడ్ రెండు దశలతో పాటు ఒమైక్రాన్ సీజన్ వరకు 7,19,092 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 37,197 మంది కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో 36,509 మంది కోలుకున్నారు. 676 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో మొదటి వేవ్‌లో 13,380 మంది కొవిడ్ బారిన పడగా, 165 మంది మృతిచెందారు. సెకండ్ వేవ్‌లో 19,085 మంది కొవిడ్ బారిన పడగా, 508 మంది మృతిచెందారు. థర్డ్ వేవ్‌లో 4,732 కొవిడ్ బారిన పడ్డారు. 2020 సంవత్సరంలో ఏప్రిల్‌లో 2.91 శాతం, మేలో 27.91 శాతం, జూన్‌లో 2.61 శాతం, జూలైలో 15.33 శాతం, ఆగస్టులో 27.10 శాతం, సెప్టెంబరులో 28.48 శాతం, అక్టోబరులో 7.88 శాతం, నవంబరులో 4.13 శాతం, డిసెంబరులో 1.63 శాతం నమోదైంది. 2021 సంవత్సరంలో జనవరిలో 1.35 శాతం, ఫిబ్రవరలో 0.96 శాతం, మార్చిలో 1.90 శాతం, ఏప్రిల్‌లో 20.04 శాతం, మేలో 30.9 శాతం, జూన్‌లో 1.91 శాతం, జూలైలో 1.22 శాతం, ఆగస్టులో 0.73 శాతం, సెప్టెంబరులో 0.32 శాతం అక్టోబరులో 0.60 శాతం, నవంబరులో 0.10 శాతం డిసెంబరులో పూర్తిగా కేసులు తగ్గుముఖం పట్టి 0.05 శాతానికి చేరుకుంది. 2022 జనవరిలో ఽథర్డ్‌వేవ్ వచ్చింది. జనవరిలో 9.96 శాతం కేసులు నమోదు కాగా ఫిబ్రవరిలో 3.69, మార్చి 0.05 శాతం, ఏప్రిల్, మేలో నిల్, జూన్‌లో 0.05 శాతం, జూలైలో 12.20 శాతం. ఆగస్టులో 1.02 శాతం, సెప్టెంబరులో 0.72, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 2023 జనవరి, ఫిబ్రవరిలో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మార్చి 10.71 శాతం పాజిటివ్ రేటు చేరుకుంది. ఏప్రిల్‌లో తగ్గుముఖం పట్టింది. ఈసారి కూడా భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
జిల్లాలో మూడు సీజన్‌లలో కొవిడ్ బాధితులు, మరణాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొవిడ్ బాధితులు మరణాలు
తంగళ్లపల్లి 2,497 39
నేరేళ్ల 858 10
చీర్లవంచ 1,031 18
కోనరావుపేట 1,773 39
ఇల్లంతకుంట 2,255 27
గంభీరావుపేట 2,078 30
పోత్గల్ 1,851 49
ఎల్లారెడ్డిపేట 4,269 111
వేములవాడ 6,287 132
చందుర్తి 2,024 41
బోయినపల్లి 1,070 29
విలాసాగర్ 308 03
కొదురుపాక 447 04
సిరిసిల్ల పీఎస్‌నగర్ 4,362 64
సిరిసిల్ల ఏబీనగర్ 4,519 80
జిల్లా ఆసుపత్రి 1,558 0
------------------------------------------------------------------------------------------------
మొత్తం 37,197 676
--------------------------------------------------------------------------------------------------
ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నాం...
- డాక్టర్ లక్ష్మీనారాయాణ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్
జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ వైరస్ లక్షణాలు లేవు. జిల్లా ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ వైరస్ అయినా చేతుల ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తున్నందున ప్రజలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా లేని చేతులతో కళ్లు, ముక్కు తాకడం వంటివి చేయవద్దు. మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఏవైరస్ వచ్చినా నియంత్రణలో పెట్టవచ్చు. ప్రజలు ఆందోళన చెందకుండా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందవచ్చు.
Updated Date - May 30 , 2025 | 02:54 PM