అధ్వానంగా జమ్మికుంట బస్టాండ్
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:21 AM
జమ్మికుంట పట్ణణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో అరకొర వసతులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ వంద గ్రామాల ప్రజల రాకపోకలతో బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునేందుకు కూర్చీలు సరిగ్గా లేవు. కొన్ని కుర్చీలు విరిగిపోగా, మరికొన్ని పక్కకు ఒరిగాయి.
జమ్మికుంట, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట పట్ణణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో అరకొర వసతులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ వంద గ్రామాల ప్రజల రాకపోకలతో బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునేందుకు కూర్చీలు సరిగ్గా లేవు. కొన్ని కుర్చీలు విరిగిపోగా, మరికొన్ని పక్కకు ఒరిగాయి. బస్టాండ్‌లో పురుషులకు సరిపడ టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఆరు టాయిలెట్స్ ఉండగా, పురుషులకు రెండు మాత్రమే టాయిలెట్స్ కేటాయించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మైక్‌సెట్ ఇప్పటికి ఉపయోగిస్తున్నారు. బస్టాండ్‌కు వచ్చి వెళ్తున్న బస్సులు ఎక్కడికి వెళ్తాయి, ఏ గ్రామాల మీదుగా వెళ్తూంటాయో ఆర్టీసీ సిబ్బంది మైక్‌సెట్ ద్వార ప్రయాణికులకు చెబుతుంటారు. ఆ మైక్‌సెట్ పాతది కావడంతో సరిగా వినిపించడం లేదు. సిబ్బంది చెబుతున్న వివరాలు వినబడక పోవడం వల్ల చాలా మంది బస్సులు మిస్ చేసుకున్నారు. సమయ వేళల పట్టిక సైతం ఇరువై ఏళ్ల నాటిది కావడంతో బస్సుల సమయ వేళలు తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన ఆర్టీసీ అదికారులు స్పందించి నూతన మైక్‌సెట్, సమయ వేళల పట్టిక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఫ నిలిచిన నార్లపూర్-మెట్‌పల్లి బస్సులు
జమ్మికుంట నుంచి నార్లపూర్-మెట్‌పల్లికి ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు బస్సులు నడిచేవి. రోడ్డు సరిగా లేదని ఆరు నెలల క్రితం ఆ బస్సులు నిలిపి వేశారు. దీంతో రాకపోకలకు గ్రామస్థుల తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వాటిని యథావిధిగా కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఫ హైదరాబాద్‌కు బస్సులు లేక ఇబ్బందులు
జమ్మికుంట నుండి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు సంవత్సర కాలంగా నిలిచిపోయాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జమ్మికుంటను సందర్శించిన సమయంలో హైదరాబాద్ బస్సులను నడిపించాలని స్థానికులు కోరారు. స్పందించిన మంత్రి వెంటనే హైదరాబాద్ బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. మరుసటి రోజు నుంచి ఉదయం 8గంటలకు జమ్మికుంట నుండి హైదరాబాద్‌కు వెళ్లే ఒక బస్సు నడిపించారు. నెలరోజుల తర్వాత నిలిపివేశారు. హైదరాబాద్‌కు బస్సులు నడిపించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
Updated Date - Jun 30 , 2025 | 12:21 AM