jagtiala : దరఖాస్తుల వెల్లువ
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:58 AM
జగిత్యాల, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకు వచ్చిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.
-ముగిసిన భూ భారతి రెవెన్యూ సదస్సులు
-జిల్లాలో 37,931 అర్జీల స్వీకరణ
-సాదాబైనామాలపైనే ఎక్కువ దరఖాస్తులు
-సమస్యల పరిష్కారంపై దృష్టి
జగిత్యాల, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకు వచ్చిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈనెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా పైలట్ మండలం బుగ్గారం మినహా మిగిలిన మండలాల్లో 37,931 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొన్ని మాత్రమే ఇప్పటివరకు ఆన్‌లైన్ అయ్యాయి. కాగా భూ భారతి అమలు కోసం సర్వేయర్ల శిక్షణ కొనసాగుతోంది. భూ భారతి అమలు కోసం గ్రామ పరిపాలన అధికారుల నియామకం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పూర్వ వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించి గత నెల 25న రాత పరీక్ష నిర్వహించింది. 149 మంది అభ్యర్థులకు గాను 142 మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా ఇందులో అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు.
ఫఆన్‌లైన్ తర్వాత ప్రక్రియ..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్ అయిన తర్వాత ఆర్జీల ఆధారంగా ఇరుగు పొరుగు రైతులకు నోటీసులు ఇచ్చి సర్వేయర్లు సర్వే చేస్తారు. ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ లాగిన్‌లో సమాచారం ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీవోలకు కూడా డిజిటల్ సంతకం అవకాశం ఇచ్చారు. అన్నీ సవ్యంగా ఉంటే పాస్ పుస్తకంతో పాటు మ్యాప్ కూడా ఇవ్వనున్నారు. దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది ఏ రోజుకారోజు కలెక్టర్‌కు నివేదించారు. సమస్యల వారీగా నివేదిక రూపొందించి సీసీఎల్‌ఏకు పంపించారు. సదస్సుల్లో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పర్యవేక్షించారు.
ఫప్రధాన సమస్యలు ఇవీ..
రెవెన్యూ సదస్సుల్లో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. పాస్ పుస్తకాల్లో భూముల సర్వే నంబర్లు లేకపోవడంపై రైతులు దరఖాస్తు చేశారు. అలాగే భూములను హోల్డ్‌లో పెట్టారని, వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పలు గ్రామాల్లో రైతులు మొరపెట్టుకున్నారు. వీటితో పాటు వారసత్వం, అసైన్డ్, సర్వే నంబర్లు, భూ యజమాని, తండ్రి పేరు, కులం, లింగం, ఆధార్ నంబర్ల తప్పులు, పాస్ పుస్తకాల్లో భూములు ఎక్కలేదని, మ్యూటేషన్, డిజిటల్ సంతకం కాలేదని తదితర సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా సాదా బైనామాల దరఖాస్తులు కూడా ఎక్కువగా వచ్చాయి.
ఫకొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ..
భూ భారతి చట్టం అమలులో భాగంగా సర్వేయర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం కొత్తగా సర్వేయర్లకు అవకాశం కల్పించింది. జిల్లాలో కేవలం 18 మంది సర్వేయర్లు ఉన్నారు. జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లకు అవకాశం కల్పించగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 297 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మొదటి బ్యాచ్ శిక్షణ కోసం 156 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 8 మంది అభ్యర్థులు రిపోర్టు చేయకపోవడంతో 148 మందికి శిక్షణ ఇస్తున్నారు. వారికి గత నెల 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కాగా జూలై 26వ తేదీ వరకు శిక్షణ పూర్తవుతుంది. రెండో బ్యాచ్‌లో 141 మంది అభ్యర్థులకు జూలై 27వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించడానికి అధికారులు నిర్ణయించారు. అన్ని అర్హతలు సాధిస్తే లైసెన్స్‌లు జారీ అవుతాయని అధికారులు అంటున్నారు.
ఆగస్టు 15లోపు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో భూ భారతి సదస్సులలో వచ్చిన దరఖాస్తులను సమస్యల వారీగా వేరు చేసి ఆన్‌లైన్ చేస్తున్నాం. ఇప్పటికే సగం దరఖాస్తుల ఆన్‌లైన్ పూర్తయింది. సంబంధిత రైతులకు నోటీసులు ఇచ్చి విచారణ తదుపరి దరఖాస్తులను పరిష్కరిస్తాం. భూ భారతి సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ఆగస్టు 15లోపు దరఖాస్తుల పరిష్కారం కాని, తిరస్కరణ కానీ పూర్తి చేస్తాం. సర్వేయర్ల సమస్య ఉన్నప్పటికీ వీటికి సంబంధం లేని దరఖాస్తులను ముందుగా పరిష్కరిస్తాం. శిక్షణ పూర్తి చేసుకుంటున్న లైసెన్స్ సర్వేయర్లు, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటాం.
-------------------------------------------------------------------
వచ్చిన దరఖాస్తుల వివరాలు..
-------------------------------------------------------------------
సాదాబైనామాలు....8,667
మిస్సింగ్ సర్వే నంబర్లు...4,237
నోషనల్ ఖాతా నుంచి పట్టా...1,080
ఎఫ్‌లైన్ పిటిషన్....459
ఇతరుల పేరుపై పట్టా భూమి నమోదు కావడం...278
అసైన్డ్ పట్టా...153
సర్వే నంబర్లలో తప్పులు...95
ఇతర సమస్యలు..14,969
-------------------------------------------------------------------
మొత్తం దరఖాస్తులు...37,931
-------------------------------------------------------------------
Updated Date - Jun 23 , 2025 | 12:58 AM