jagitiala : అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
ABN, Publish Date - May 26 , 2025 | 12:32 AM
జగిత్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్లలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచి రైతులు ఆందోళన చెందుతున్నారు.
-కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
-ధాన్యం సేకరణలో అడ్డంకులు
-ఆందోళనలో రైతులు
జగిత్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్లలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యం మొలకెత్తడం, బూజు పట్టడంతో నష్టం వాటిల్లుతోంది. వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలు బురదమయం కావడం, వరద నీటితో నిండిపోవడంతో లారీలు లోపలికి వెళ్లలేక రోడ్లపై నిలిపివేస్తున్నారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రోడ్లపైకి తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ లోడింగ్‌కు కూలీలు, కిరాయితో కలిసి రూ.600 వరకు వ్యయం చేస్తున్నారు. టార్పాలిన్ కవర్ల కిరాయి అదనపు భారంగా మారుతోంది. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరొకచోటికి మార్చడం, కవర్లు కప్పడం వంటి పనులతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆలస్యంగా దిగుబడి వచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడుస్తోంది.
ఫవర్షంతో ఇక్కట్లు
జిల్లాలో ధాన్యం సేకరణకు అకాల వర్షాలు అడ్డంకులను సృష్టిస్తున్నాయి. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు మొత్తం 428 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈసీజన్‌లో సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేశారు. ఈనెల 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 4,07,178 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఇందులో 67,747 మంది రైతుల నుంచి రూ.939.19 కోట్ల విలువ గల 4,05,133 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, 268 మంది రైతుల నుంచి రూ.4.74 కోట్ల విలువ గల 2,045.080 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించారు. ఇప్పటివరకు 58,171 మంది రైతులకు 3,31,783.320 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ. 769.74 కోట్ల డబ్బులను ఖాతాల్లో జమ చేశారు. వంద శాతం కొనుగోలు పూర్తి అయిన 194 కేంద్రాలను అధికారులు మూసివేశారు.
ఫజిల్లాలో జోరుగా వర్షం..
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులు జోరుగా వర్షం కురిసింది. జిల్లాలో ఈనెల 21వ తేదీన 248.2 మిల్లీ మీటర్ల వర్షం కురవగా సగటు వర్షపాతం 12.4 మి.మీగా నమోదైంది. 22వ తేదీన 572.7 మి.మీ.గా వర్షం కురవగా సగటు వర్షపాతం 28.6 మి.మీగా, 23న 835.6 మి.మీల వర్షం కురవగా సగటు వర్షపాతం 41.8 మి.మీగా, 24న 510.మి.మీల వర్షం కురవగా సగటు వర్షపాతం 25.5 మి.మీగా నమోదైంది. ఈనెల 25న 86.4 మి.మీల వర్షం కురవగా సగటు వర్షపాతం 4.3 మి.మీగా నమోదైంది.
ఫపరిష్కారానికి చర్యలు..
జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో మిల్లుల వద్ద ధాన్యం తరలింపు ఆలస్యమైనప్పటికీ పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడంతో వేగవంతమైంది. అకాల వర్షాలు, తూకం, లోడింగ్‌కు అడ్డంకిగా మారుతున్నాయి. రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కాల్వలు తీసి, కవర్లు మార్చి శ్రమిస్తున్నారు. పలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్ లత పరిశీలించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిలు పలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.
వానలు దెబ్బతీస్తున్నాయ్..
-ముంజం రాజేందర్, రైతు, తిప్పన్నపేట
ఈయేడు ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చి పది రోజులు దాటింది. మొన్ననే మాయిశ్చర్ వచ్చింది. తూకం వేయడానికి నా సీరియల్ నంబరు వచ్చే సరికి వానలు మొదలయ్యాయి. మూడు రోజుల నుంచి వానలతో కవర్లు కప్పుడు, కాలువలు తీసుడే అవుతోంది. అయినా వడ్లు తడుస్తున్నాయి. దీంతో నష్టం తప్పేలా లేదు. సుమారు 90 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించడానికి ప్రైవేటు మిల్లుకు తరలించాను.
ప్రతీ ధాన్యం గింజను కొంటాం
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్
అన్నదాతలు పండించిన చివరి ధాన్యపు గింజనూ మద్దతు ధర అందించి కొనుగోలు చేస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోళ్లలో తృతీయ స్థానంలో జిల్లా నిలిచింది. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అవసరమయితే కేంద్రాల్లో హామలీల సంఖ్యను పెంచి కొనుగోళ్లు పూర్తి చేస్తాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను సైతం ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.
Updated Date - May 26 , 2025 | 12:32 AM