jagitial : ఉపాధి కూలీలకు భరోసా
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:00 AM
జగిత్యాల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం కూలీలకు సొంత గ్రామంలో పని కల్పిస్తూ ఆర్థిక చేయూత అందిస్తోంది.
-పీఎం సురక్ష బీమా యోజనతో రూ.2 లక్షల పరిహారం
-జిల్లాలో 2.73 లక్షల మందికి ప్రయోజనం
-18 నుంచి 70 సంవత్సరాల వయస్సు వారు అర్హులు
-చెల్లించాల్సిన ప్రీమియం రూ.20
జగిత్యాల, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం కూలీలకు సొంత గ్రామంలో పని కల్పిస్తూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వంద రోజుల పని దినాలు కల్పించడంతో పాటు కూలి రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వారికి బీమా పథకం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీల భద్రత కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకం అమలు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సుమారు 2.73 లక్షల మంది ఉపాధిహామీ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది.
ఫనామమాత్రపు రుసుముతో..
ఉపాధి కూలీల కోసం అమలు చేస్తున్న బీమా పథకంలో చేరే కూలీలు నామమాత్రంగా అంటే కేవలం రూ.20 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలు ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి అంగవైకల్యం కలిగిన రూ.2 లక్షలు అందజేస్తారు. పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.లక్ష నష్ట పరిహారం అందిస్తారు. ఉపాధి కూలీలందరూ బీమా పథకంలో చేరేలా అవగాహన కల్పించి వెంటనే వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫసిబ్బంది చేయాల్సిన విధులు..
ఉపాధి సిబ్బంది ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన బీమా పథకంపై గ్రామాల్లో కూలీలకు అవగాహన కల్పించాలి. అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పని చేసే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న కూలీ పేరు, తండ్రి/భర్త పేరు, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా వివరాలు సేకరించాలి. కూలీలతో బ్యాంకు, పోస్టాఫీసులో బీమా పథకంలో చేరుతున్నట్లు జూలై 31వ తేదీలోపు లేఖలు ఇప్పించాలి. పేరు నమోదు చేయించుకున్న కూలీల వివరాలు రాష్ట్ర కార్యాలయానికి ఆగస్టు 1వ తేదీ లోపు అధికారులు పంపించాల్సి ఉంటుంది.
ఫఅర్హతలు
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉపాధి కూలీలందరూ ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. అర్హత ఉన్న కూలీలు వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఉన్న ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసులో తమ పేరును నమోదు చేసుకొని ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది. జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసులో బీమా పథకంలో పేరు నమోదు చేయాలని రాతపూర్వక అభ్యర్థనతో పాటు ప్రతీయేటా తమ ఖాతా నుంచి రూ.20 బీమా రుసుము చెల్లించాలని లేఖను అందించాల్సి ఉంది. ఒకసారి కూలీలు లేఖ ఇస్తే దాని ఆధారంగానే ప్రీమియం సొమ్మును బ్యాంకు చెల్లిస్తుంది. ప్రతీ యేడాది జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బీమా అమలులో ఉంటుంది.
అర్హులంందరికీ బీమా
-రఘువరన్, డీఆర్‌డీవో
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న అర్హులైన కూలీలందరికీ బీమా చేయించడమే లక్ష్యంగా నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం అమలు చేయనున్న పీఎంఎస్‌బీవై పథకంలో చేరిన కూలీలు ఏదైనా ప్రమాదం బారిన పడితే రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది.
----------------------------------------------------------------------------------------------------
జిల్లాలోని మండలాలు...20
గ్రామ పంచాయతీలు..380
జాబ్ కార్డులు...1.67 లక్షలు
మొత్తం కూలీల సంఖ్య..2.73 లక్షలు
శ్రమ శక్తి సంఘంలోని కుటుంబాల సంఖ్య...1.05 లక్షలు
కూలీల సంఖ్య....1.46 లక్షలు
----------------------------------------------------------------------------------------------------
Updated Date - Jul 28 , 2025 | 01:00 AM