బడికి వేళాయే..
ABN, Publish Date - Jun 12 , 2025 | 02:44 AM
బడి గంట మోగింది.. దాదాపు రెండు నెలల పాటు ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు సెలవులకు బైబై చెప్పి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
బడి గంట మోగింది.. దాదాపు రెండు నెలల పాటు ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు సెలవులకు బైబై చెప్పి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పొద్దున్నే లేచి పిల్లలను రెడీ చేయడంతోపాటు టిఫిన్లు పెట్టి పాఠశాలలకు వెళ్లబోమని మారాం చేసే పిల్లలను బుజ్జగించడం మొదలవుతుంది. కొత్తగా పాఠశాలల్లో చేరే పిల్లలను అలవాటు చేయించడం కోసం తల్లిదండ్రులు పడే తంటా అంతా ఇంతా కాదు. ఈసారి రుతుపవనాలు ముందే పలకరించడంతో వాతావరణం అనుకూలంగా విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి షెడ్యూల్ కూడా ప్రకటించారు. 6 నుంచి 10వ తేది వరకు బడిబాట ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. 11వ తేదిన నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేశారు. 12న పాఠశాల ప్రారంభించిన రోజున పాఠ్య, నోట్‌పుస్తకాలతో పాటు యూనిఫామ్ అందిస్తారు. 13న ప్రజాప్రతినిధులు, అమ్మ, ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహిస్తారు. 16న ఎఫ్‌ఎల్‌ఎన్, లిప్ దినోత్సవం, 17న అన్ని పాఠశాలల్లో సమీకృత విద్య, బాలిక విద్యా దిన్సోవం నిర్వహించి బాలికావివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తారు. 18న తల్లిదండ్రులను, గ్రామస్థులను పాఠశాలకు ఆహ్వానించి తరగతి గదుల్లో ఏర్పాటుచేసిన డిజిటలీకరణ ఇతర సౌకర్యాలను చూపించి వాటి గురించి వివరిస్తారు. 19న బడిబాట ముగింపు రోజున విద్యార్థులకు క్రీడలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి. జిల్లాలోని పాఠశాలలు ఆకర్షించే విధంగా, సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా బస్సు, రైలుబండి, జంతువుల చిత్రాలు, మహనీయుల చిత్రాలతో ఆకర్షణీయంగా తయారుచేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 626 ఉన్నాయి. గత విద్యాసంవత్సరం 82,636 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 50,516 మంది, ప్రైవేట్‌పాఠశాలల విద్యార్థులు 32,120 మంది ఉన్నారు.
తొలిరోజే బ్యాగ్ నిండా పుస్తకాలు
పాఠశాలల పునః ప్రారంభం నుంచే బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది గతంలో త్రైమాసిక పరీక్షల సమయానికి కూడా అన్ని పుస్తకాలు వచ్చేవి కావు. సీనియర్ల పాత పుస్తకాలతో సర్దుకునే పరిస్థితి ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా తొలిరోజే బ్యాగు నిండా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు అందజేసే ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1వ తరగతి నుంచి 10వతరగతి వరకు 2 లక్షల 70 వేల 587 పాఠ్యపుస్తకాలకు అవసరం ఉండగా, 2 లక్షల 58 వేల 437 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. నోట్ పుస్తకాలు పూర్తిసాయిలో 3,07,765 వచ్చాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్క్‌బుక్స్ 52 వేల 354 అవసరం ఉండగా, 34వేల237 వచ్చాయి. గత నెలలోనే పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకోగా విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు పుస్తకాలు పంపించారు.
రెండు జతల యూనిఫామ్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రెండు చేతుల యూనిఫామ్‌లు మొదటి రోజే అందించడానికి ఏర్పాటు చేశారు. యూనిఫాంల తయారీని స్వశక్తి సంఘాల మహిళలకు అప్పగించారు. ఇందుకోసం మహిళకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ప్రతి విద్యార్థులు ఇచ్చే రెండు జతల యూనిఫామ్‌ల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చొక్కా, నిక్కర్, 6 నుంచి 10వ తరగతి వరకు షర్ట్, పాయింట్, బాలికలకు 1 నుంచి 3 తరగతి షర్ట్, లాంగ్ ఫ్రాక్, 4 నుంచి 5వ తరగతిలకు షర్టు, స్కర్ట్, 6వ తరగతి నుంచి 10వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్సులు ఇవ్వనున్నారు.
ఆసక్తిగా అకడమిక్ క్యాలెండర్..
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సర్కారు పాఠశాలల్లో విద్యను అందించడానికి పకడ్బందీగా విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ రూపొందించింది. విద్యాబోధనతో పాటు యాక్టివిటీలకు ప్రాధాన్యమిస్తూ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 230 పని దినాలను నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సిలబస్ పూర్తిచేయడానికి గడువు పెట్టింది. ప్రతిరోజు పాఠశాలకు విద్యార్థులు 90శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రత పెంచడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే దిశగా చర్యలు చేపట్టాలి. ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని క్యాలెండర్లో పేర్కొన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థితో 30నిమిషాల పాటు చదివించాలి. రీడింగ్ యాక్టివిటీలో పాఠ్యపుస్తకాలతో పాటు కథల పుస్తకాలు, దినపత్రికలు, మాగ్జిన్లు వంటి వాటిని చదివించాలి. పదవ తరగతి సిలబస్ 2026 జనవరి 10లోగా పూర్తిచేయాలి. 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలి. ఇక ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నడిపించాలి. ప్రతినెల మూడో శనివారం బ్యాగ్‌లెస్ డేగా పాటించాలి.
మధ్య తరగతి కుటుంబాలకు స్కూల్ భయం...
పాఠశాలలు తెరుచుకోవడం, ప్రైవేటు పాఠశాలలకు పంపించే మధ్య తరగతి కుటుంబాలకు మాత్రం స్కూల్ భయంగానే మారింది. పాఠ్యపుస్తకాల ధరలు, ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత విద్యార్థుల తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ప్రతి ఇంటికి అదనంగా రూ.50 వేల ఖర్చు జూన్ మాసంలో ఉంటుంది. ఇంజనీరింగ్, ఇంటర్మీడీయేట్ ఇతర చదువులకు లక్షల్లోనే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతికి రూ.15 నుంచి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడుగా బస్ రవాణా చార్జీలు, ఇతర వర్క్‌బుక్‌లు, స్కూల్‌లో ఇతర యాక్టివిటీస్ ఫీజులతో మధ్య తరగతి కుటుంబాలు అల్లాడుతున్నాయి.
Updated Date - Jun 12 , 2025 | 02:44 AM