మిల్లుల్లో తనిఖీలు
ABN, Publish Date - Jul 05 , 2025 | 01:12 AM
సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంటోంది. గతంలో ఆయా సీజన్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి సకాలంలో బియ్యం అందించని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఆర్‌ఆర్ చట్టాలు నమోదు చేశారు.
- గత వానాకాలం ధాన్యం నిల్వలపై ఆరా
- ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయి అధికారుల సంయుక్త పరిశీలన
- ఈనెల 6వ తేదీ వరకు నివేదికకు అవకాశం
- ధాన్యం ఫిజికల్ వెరిఫికేషన్‌తో మిల్లర్లలో దడ
- జిల్లాలో 90కిపైగా మిల్లుల్లో సోదాలు
జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంటోంది. గతంలో ఆయా సీజన్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి సకాలంలో బియ్యం అందించని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఆర్‌ఆర్ చట్టాలు నమోదు చేశారు. తాజాగా 2024-25 వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం నిల్వలు ఉన్నాయా...? లేవా..? అని ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా), పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మిల్లులను సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈనెల 6వ తేదీలోపే తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో గత వానాకాలం సీజన్ మిల్లింగ్ చేయని ధాన్యం కేటాయించిన మేరకు నిల్వలు ఉన్నాయా? లేవా..? అని అధికారులు తేల్చనున్నారు. జిల్లాలోని సుమారు 90కి పైగా మిల్లుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లాలో ఈనెల 2వ తేదీ నుంచి తనిఖీలు ప్రారంభించాల్సి ఉండగా పరిశీలనకు బృందాలు సిద్ధం కాకపోవడంతో ఈనెల 3వ తేదీ నుంచి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కొంతమంది మిల్లర్లు నాణ్యమైన బియ్యాన్ని పక్కదారి పట్టించి అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ సీజన్ ధాన్యం అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.
- పొడిగింపు కోసమేనా?
జిల్లాలో 2023-24 యాసంగి సీజన్‌కు సంబంధించి 87 శాతం పూర్తయింది. 37,000 మెట్రిక్ టన్ను ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ను మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. జూలై 27వ తేదీ వరకు అప్పగించాల్సి ఉంది. 2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ 11 శాతం పూర్తయింది. ఇంకా 2.82 లక్షల టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. మిల్లర్లు బియ్యం అప్పగించడానికి ఇంకా గడువు మిగిలి ఉంది. 2024-25 వానాకాలం సీజన్‌కు సంబంధించి 58 శాతం సీఎంఆర్ లక్ష్యం నెరవేరింది. ఇంకా 88,000 మెట్రిట్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. సీఎంఆర్ అప్పగించడానికి గడువు మే 30వ తేదీ వరకు ముగిసింది. అయితే 2024-25 వానాకాలం పంట ధాన్యం నిల్వలను పరిశీలించాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ సీజన్ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లకు మరోసారి గడువు పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌కు సంబంధించి ధాన్యం అప్పగింతకు గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేసి అంతా సక్రమంగా ఉంటే గడువు పెంచే అవకాశం ఉంది. ఒక వేళ ధాన్యం నిల్వలో తేడా గమనిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీటిలో ఒక వానాకాలం సీజన్ ధాన్యమే పరిశీలించాల్సి ఉంది.
- రికవరీపై దృష్టి..
సకాలంలో బియ్యం అప్పగించని మిల్లర్లపై ఇప్పటికే ఆర్‌ఆర్ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పలు మిల్లులను సీజ్ చేయడానికి సైతం కసరత్తులు చేస్తున్నారు. దీంతో తమ బకాయిలు కట్టేందుకు కిందామీదా పడుతున్నారు. రాజకీయ, ఇతర ఒత్తిళ్లతో కేసుల నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేశారు. మళ్లీ ధాన్యం తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పౌరసరఫరాలశాఖ అధికారులు నిబంధనలు కఠినతరం చేయడం వల్ల గత యాసంగిలో పలువురు మిల్లర్లు ధాన్యం కేటాయింపునకు దూరమయ్యారు. అంతేగాక బ్యాంకు గ్యారంటీలు, జరిమానాలు చెల్లించలేక పోయారు. మరోవైపు కేసులనుంచి తప్పించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తుండడం, రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతుండడం వంటివి బకాయి మిల్లర్లు చేస్తున్నారు.
- వేలం ధాన్యమేది?
సీఎంఆర్ యాసంగి సీజన్ 2022-23 ఇవ్వని మిల్లర్ల నుంచి ధాన్యాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు వేలం వేయగా, కొన్ని ఏజెన్సీలు టెండర్లు దక్కించుకున్నాయి. మిల్లర్లు తీసుకున్న ధాన్యం ఏజెన్సీలకు అప్పగించాల్సి ఉంటుంది. గడువు జూన్ 30వ తేదీతో ముగిసినా, ఇంకా ధాన్యం ఇవ్వని మిల్లర్లు ఉన్నారు. జిల్లాలో సుమారు 93,000 మెట్రిక్ టన్నుల వేలం ధాన్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. వాస్తవంగా ఈ ధాన్యమంతా కొందరు ఎన్నడో బయట మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నారన్నది బహిరంగ రహస్యం. రూ. కోట్లలో ధాన్యం మిల్లర్లు ఇంకా ఇవ్వల్సి ఉండడమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తరుణంలో అధికారులు తనిఖీలు చేసి, మిల్లర్ల వద్ద ఉన్న నిల్వల లెక్కలను తేల్చనున్నారు.
తనిఖీల ఆధారంగా చర్యలు
- జితేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి, జగిత్యాల
మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం నిల్వలు, సీఎంఆర్ ఇవ్వాల్సింది, వేలం ధాన్యం బకాయిల గురించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము. రెండు, మూడు రోజుల్లో తనిఖీలు పూర్తవుతాయి. అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము.
6లోపు నివేదికను అందజేస్తాం
- జితేంద్ర ప్రసాద్, జిల్లా సివిల్ సప్లయి కార్పొరేషన్ మేనేజర్, జగిత్యాల
జిల్లాల్లో సీఎంఆర్ బకాయిలున్న మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులతో కలిసి సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నాము. ధాన్యం నిల్వల ఫిజికల్ వెరిఫికేషన్ జరుపుతున్నాము. పరిశీలనలో గుర్తించిన వివరాలతో ఈనెల 6వ తేదీ లోపు నివేదికను ప్రభుత్వానికి అందిస్తాము.
Updated Date - Jul 05 , 2025 | 01:12 AM