పంటల రుణ పరిమితి పెంపు
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:15 AM
ఈయేడాది పంటల రుణ పరిమితిని ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఈయేడాది పంటల రుణ పరిమితిని ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) సిఫార్సుల మేరకు ఈ పెంపు ఉంటుంది. ప్రధానంగా రైతులకు ఏటా సాగులో పెట్టుబడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపు ద్వారా అన్నదాతకు బ్యాంకుల నుంచి లభించే రుణం పెరగనుంది. వరి, మొక్కజొన్న, పత్తి రైతులకు రూ.2 వేలు అదనంగా రుణం మంజూరు కానుంది. జిల్లాలో ఈయేడాది సుమారు 4.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 2,48,550 మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.5ఎకరాల్లోపు 1,79,826 మంది రైతులు, 2.5 నుంచి 5 ఎకరాల్లోపు 52,692 మంది రైతులు, 5 ఎకరాల పైన 16,032 మంది రైతులున్నారు.
ఫజిల్లాలో వానాకాలం సాగు అంచనా ఇలా..
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4,15,169 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 3,10,642 ఎకరాలు, మొక్కజొన్న 32 వేల ఎకరాలు, కందులు 1,500 ఎకరాలు, పత్తి 18 వేల ఎకరాలు, చెరుకు 500 ఎకరాలు, పసుపు 8,500 ఎకరాలు, మిరప 500 ఎకరాలు, మామిడి 38,277 ఎకరాలు, వివిధ కూరగాయలు 400 ఎకరాలు, ఆయిల్ ఫామ్ 3,750 ఎకరాల్లో సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఫవరి, మొక్కజొన్న, పత్తి రైతులకు మేలు..
జిల్లాలో అత్యధికంగా సాగయ్యే వరి, మొక్కజొన్న, పత్తికి సంబంధించి పంట రుణ పరిమితి పెంచడం ద్వారా రైతులకు మేలు చేకూరనుంది. ఎకరానికి నిర్ధారిత మొత్తం బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా సాగులో వారికి పెట్టుబడికి ఉపయుక్తంగా ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు రుణ పరిమితిని రూ.2 వేల వరకు పెంచారు.
ఫబ్యాంకులు ఆదరించేలా..
ఈ యేడాది రెండు లక్షలకు పైగా రైతులకు రుణాలు అందజేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నదాతలకు విరివిగా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాత రుణాన్ని రెన్యూవల్ చేస్తున్నట్లు చేసే బ్యాంకర్లు రుణ పరిమితి ఆధారంగా పెంచిన మొత్తాన్ని రైతుల చేతికి ఇచ్చి మిగతా మొత్తం పాత బకాయిగా సర్దుబాటు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
-భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ప్రభుత్వం పెంచిన రుణ పరిమితిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంకర్లు రైతులకు విరివిగా పంట రుణాలు అందించాలి. పెంచిన రుణ పరిమితి ఆధారంగా రుణాలు పంపిణీ చేయాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.
----------------------------------------------------------------------------
పంటల వారీగా రుణ పరిమితి
----------------------------------------------------------------------------
పంట - ప్రస్తుత రుణ పరిమితి - పెంచిన రుణ పరిమితి
పత్తి - 46 వేలు - 48 వేలు
సోయా - 30 వేలు - 30 వేలు
మినుము - 21 వేలు - 22 వేలు
పెసర్లు - 18 వేలు - 19 వేలు
శనగ - 26 వేలు - 27 వేలు
జొన్న - 20 వేలు - 21 వేలు
వరి - 34 వేలు - 36 వేలు
మొక్కజొన్న - 34 వేలు - 36 వేలు
కందులు - 21 వేలు - 22 వేలు
Updated Date - Jul 07 , 2025 | 02:15 AM