బోధనకు మెరుగులు
ABN, Publish Date - May 15 , 2025 | 12:38 AM
జగిత్యాల, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కొంత మంది విద్యార్థులు చదవడం, రాయడం వంటివి కూడా చేయకపోతుండటాన్ని ఇటీవల పలు సర్వేలు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల లోపాలను సరిచేసేందుకు ముందుగా ఉపాధ్యాయులకే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
-ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ
-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు
-జిల్లాలో మూడు విడతలుగా 3 వేల మందికి శిక్షణ
జగిత్యాల, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కొంత మంది విద్యార్థులు చదవడం, రాయడం వంటివి కూడా చేయకపోతుండటాన్ని ఇటీవల పలు సర్వేలు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల లోపాలను సరిచేసేందుకు ముందుగా ఉపాధ్యాయులకే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తొలి విడత ఉపాధ్యాయులకు బుధవారం నుంచి మొదలైన శిక్షణ తరగతులు ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఫ17 తేదీ వరకు తొలి విడత
జిల్లాలో మూడు విడతల్లో మూడు వేల మందికి పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. తొలి విడతల శిక్షణ ఈనెల 17వ తేదీ వరకు జరగనుంది. రెండో విడత శిక్షణ ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, మూడో దశ శిక్షణ ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ విభాగాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. వీరిలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌లతో పాటు వివిధ టీచర్లున్నారు. తొలి విడతలో 821 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఎస్‌జీటీలు 160 మంది, ఉర్దూ మీడియం ఎస్‌జీటీలు 49 మందికి, ఎస్‌జీటీ తెలుగు 160 మంది, ఎఫ్‌ఐ ఇంగ్లీష్ 171 మంది, ఎస్‌జీటీ మ్యాథ్స్ 120 మంది, ఎస్‌జీటీ సోషల్ 124 మంది, స్పెషల్ ఎడ్యూకేషన్ టీచర్లు 37 మందికి శిక్షణ ఇస్తున్నారు.
ఫమూడు కేంద్రాల్లో కొనసాగుతున్న శిక్షణ
జిల్లా కేంద్రంలోని మూడు పాఠశాలల్లో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని దరూర్‌లో గల జడ్పీహెచ్‌ఎస్, కరీంనగర్ రహదారిలో గల మానస ఎక్స్‌లెన్స్ పాఠశాల, పురాణిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే పలు సమస్యలు ఎదురవడం కారణంగా పురాణిపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ఓల్డ్ హైస్కూల్‌కు మార్పు చేశారు. మండల రిసోర్స్ పర్సన్లకు, తెలుగు మీడియం ఎస్‌జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లు, ఇంగ్లీష్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్స్, సామాజిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్లు, ఐఈఆర్‌పీలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో ఉపాధ్యాయులకు టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
ఫజియో ట్యాగింగ్ హాజరు విధానం
శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. శిక్షణ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతీ ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకొని, దానిని తమ సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధానం శిక్షణ పారదర్శకతను ఉపాధ్యాయుల బాధ్యతను నిర్ధారిస్తుంది.
ఫలక్ష్యాలు..
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధ్యాయులు ఆధునిక బోధన పద్ధతులను అవలంభించడం, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సృజన్మాతక నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. డిజిటల్, ఏఐ ఆధారిత సాధనాల ద్వారా విద్యను సరళీకృతం చేయడం, పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.
ఫశిక్షణ అంశాలు..
ఉపాధ్యాయులకు ఆధునిక విద్యా పద్ధతులపై సమగ్ర శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, ఆన్‌లైన్, డిజిటల్ సాధనాల ద్వారా బోధనా విధానాలను మెరుగుపరచడం, ఏఐ సాంకేతికతను విద్యా బోధనలో ఏకీకృతం చేయడం వంటివి అంశాలుగా పెట్టుకున్నారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, పాఠ్యాంశాల ఆధారంగా నిర్దిష్ట అభ్యసన ఫలితాలను సాధించడం, తరగతి గదిలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
పకడ్బందీగా శిక్షణ తరగతులు
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లా కేంద్రంలోని మూడు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులందరూ విధిగా శిక్షణ శిబిరానికి హాజరయ్యేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. నిర్ణయించిన అంశాల వారీగా శిక్షణ కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను మరింత మెరుగుపరచడంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
Updated Date - May 15 , 2025 | 12:38 AM