‘కాసుల’ వేట... ప్రజారోగ్యంతో ఆట
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:19 AM
కల్తీ.. కల్తీ... ఆహారపదార్థాలు, వస్తువులు, నూనె, ఔషధాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, మద్యం వంటి ఇలా ప్రతి ఒక్కటీ కల్తీ అవుతోంది. పట్టణం, గ్రామీణ ప్రాంతమనే తేడా లేకుండా కల్తీ మాఫియా విజృంభించి ప్రజల ప్రాణాలను హరించే విధంగా కాలకుటవిషాన్ని విరజిమ్ముతున్నది.
- జిల్లాలో పెట్రేగిపోతున్న ‘కల్తీ’ మాఫియా
- రోజుకు రూ. కోట్లలో అక్రమ వ్యాపారం....
- నామమాత్రంగా ఆహారభద్రతా శాఖ తనిఖీలు
కరీంనగర్ క్రైం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): కల్తీ.. కల్తీ... ఆహారపదార్థాలు, వస్తువులు, నూనె, ఔషధాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, మద్యం వంటి ఇలా ప్రతి ఒక్కటీ కల్తీ అవుతోంది. పట్టణం, గ్రామీణ ప్రాంతమనే తేడా లేకుండా కల్తీ మాఫియా విజృంభించి ప్రజల ప్రాణాలను హరించే విధంగా కాలకుటవిషాన్ని విరజిమ్ముతున్నది. ఆహార పదార్థాలు, వస్తువులు, పప్పు దినుసుల కొనుగోలు సమయంలో అసలైనది ఏదో... నకిలీది ఏదో తేల్చుకోలేని పరిస్థితిలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కల్తీని అరికట్టి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఆహారభద్రత (ఫుడ్‌సేఫ్టీ), విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా కల్తీ మాఫియా రెచ్చిపోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణం, గ్రామం అనే తేడాలేకుండా అంతటా కల్తీ మాఫియా విజృంభిస్తున్నది. కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో కోట్ల రూపాయలు కల్తీ వ్యాపారం జరగుతున్నది. కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తూ ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. అక్రమ కల్తీ, నకిలీ దందాలను అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో కల్తీ మాఫియా తన దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. కల్తీ ఆహార పదార్థాలు, వస్తువులు విక్రయిస్తున్న వ్యాపారులపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి, జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి.
కరీంనగర్ కేంద్రంగా..
కరీంనగర్‌లో ఇటీవల విజిలెన్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంత కాలం కిందట కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు నిర్వహిచిన తనిఖీల్లో కల్తీ తినుబండారాల దందా వెలుగు చూసింది. గతంలోనూ నాసిరకం పప్పు దినుసులు, పశువుల కొవ్వుతో తయారైన వనస్పతి నూనె, కల్తీ ఇంజన్ ఆయిల్, నకిలీ డిస్టిల్డ్ వాటర్, నకిలీ వాహన విడి భాగాలు, కల్తీ పెట్రోల్, డీజిల్ ఇలా పలు వస్తువులకు నకిలీ లను అధికారులు పట్టుకున్నారు.
ఆహారాల్లో కృత్రిమ, గడువు ముగిసిన రంగులు
కరీంనగర్‌లో శుక్రవారం పలు హోటళ్లు, బేకరీలు, ఇతర ఆహార తయారీ కేంద్రాలను గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి రోహిత్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి అంకిత్‌రెడ్డిల బృందం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జగిత్యాల రోడ్‌లోని ‘విశ్వ కేక్ జోన్’లో కృత్రిమ రంగుల వాడుతున్నట్లు గుర్తించారు. కేక్‌లు, ఇతర బేకరీ పదార్థాలలో గడువు ముగిసిన రంగులు వాడుతున్నట్లు వెల్లడైంది. కిచెన్ అపరిశుభ్రంగా ఉంది. 10 వేల విలువైన గడువు ముగిసిన వస్తు, పదార్థాలను చెత్తబుట్టలో పడేశారు. కన్ఫెక్షనరీ కిచెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. విశ్వ కేక్ జోన్‌పై జరిమానా విధించేందుకు కేసు నమోదు చేయనున్నట్లు గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌రెడ్డి తెలిపారు.
నేడు సురక్షిత ఆహార దినోత్సవం...
ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 7న జరుపుకుంటారు. ఆహారభద్రత గురించి అవగాహన కల్పించేందుకు, ఆహార సంబంధిత వ్యాధులు, ఆరోగ్య సమస్యలను నివారించేందుకు, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు ఈ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సురక్షిత ఆహారం కోసం అవసరమైన చర్యలను తీసుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల కారణంగా ప్రతి ఏడాది 600 మిలియన్‌ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 4.20 లక్షల వరకు మరణాలు సంభవిస్తాయని అంచనా. 2025 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం థీమ్ ‘ఆహార భద్రత’- సైన్స్ ఇన్ యాక్షన్. ఆహార జీవిత చక్రంలో ఆహార భద్రతను నిర్ధారించడంలో సైన్స్ పోషించే పాత్రను ఈ థీమ్ తెలుపుతుంది.
Updated Date - Jun 07 , 2025 | 01:19 AM