ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖరీఫ్‌పై ఆశలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 01:17 AM

వరుసగా నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో ఖరీఫ్‌ సాగుపై రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే వచ్చినా నెలరోజులపాటు వర్షాలు అడపాదడపా కూడా కురియకపోవడంతో ఈసారి కరువు తప్పదా అన్న అనుమానాలు కలిగాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వరుసగా నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో ఖరీఫ్‌ సాగుపై రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే వచ్చినా నెలరోజులపాటు వర్షాలు అడపాదడపా కూడా కురియకపోవడంతో ఈసారి కరువు తప్పదా అన్న అనుమానాలు కలిగాయి. నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలతో జిల్లాలో వరినాట్లు ముమ్మరమయ్యాయి. ఎగువన వర్షాలు కురిసి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కూడా నీరు వచ్చి చేరుతుండడంతో త్వరలోనే ప్రాజెక్టు నీరు కూడా విడుదల చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. వర్షపు నీరు, బావుల నీటితో నాట్లు వేసుకుంటే మరో దఫా మూడు నాలుగు రోజులపాటు ప్రస్తుతం కురిసిన మాదిరిగానే వర్షాలు వస్తే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి విడుదల ప్రారంభిస్తారని భావిస్తున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలుకాగా ఈ నెల 27 వరకు కూడా కేవలం 25 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. వరుసగా కురిసిన వర్షాల కారణంగా జూలై 28న 5 టీఎంసీల నీరు, జూలై 29న మరో 5 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం జూలై 29 సాయంత్రానికి 36.464 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టులోకి 64,345 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండడంతో 30 ఉదయానికి ప్రాజెక్టు నీటిమట్టం 39-40 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. 50 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంటే సాగు కోసం నీటి విడుదల ప్రారంభిస్తారు. గత సంవత్సరం 45 టీఎంసీల నీరు ఉన్నా విడుదల ప్రారంభించారు.

ఫ వరినాట్లు ముమ్మరం

మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిస్తే త్వరలోనే ప్రాజెక్టు నీటి విడుదల ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్న రైతులు వరినాట్లను ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో వ్యవసాయశాఖ 2,76,500 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేసింది. ఇప్పటికే 1,71,523 ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. మరో లక్షా 5 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉన్నది. ప్రస్తుతం వర్షపు నీటితో పొలాలన్నింటినీ దున్ని రైతులు నాటుకు సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో 48 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటికే 38,457 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అవన్నీ మొలకెత్తాయి. అలాగే 4 వేల ఎకరాల్లో మొక్కజొన వేయాల్సి ఉండగా 2,620 ఎకరాల్లో విత్తనాలు వేయడం పూర్తయింది. 3 వేల ఎకరాల్లో పెసర, కంది పంటలు వేస్తారని అంచనా వేయగా 512 ఎకరాల్లో మాత్రమే ఈ పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు వ్యవసాయశాఖ అంచనా వేసిన మేరకు సాగవుతాయని భావిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద కరీంనగర్‌ జిల్లాలోని 1,39,787 ఎకరాలు సాగవుతాయి. ఇందులో లక్ష ఎకరాలు ఎల్‌ఎండీ దిగువన ఉండగా 39 వేల ఎకరాలు ఎల్‌ఎండీ ఎగువన ఉన్నాయి. కాకతీయ కాలువ ద్వారా ఈ ఆయకట్టుకు నీరు అందుతుంది. ఈ ఆయకట్టు మొత్తం ప్రస్తుతం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమై ఇప్పటికే సగం వరకు నాట్లు వేశారు. బోరుబావులు, ఓపెన్‌ బావులు, చెరువులు, కుంటల కింద మరో లక్షా 30 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పటికే జిల్లాలో అంచనా వేసిన విస్తీర్ణంలో 50 శాతం నాట్లు పూర్తికాగా మిగతా నాట్లు మరో 15 రోజుల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 01:17 AM